బ్రహ్మచారిణిగా అమ్మవారిని ఇలా సేవించాలి
శరన్నవరాత్రులలో నవదుర్గల ఆరాధన వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ఆలయాలలో ఆ తల్లిని ఒక్కోరోజున ఒక్కోరూపంగా అలంకరించి ... ఒక్కోనామంతో పూజించడం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో నవరాత్రులలో రెండవ రోజైన 'విదియ' రోజున అమ్మవారిని 'బ్రహ్మచారిణి'గా అలంకరించి కొలుస్తుంటారు.
సదాశివుడిని భర్తగా పొందడం కోసం అమ్మవారు వేల సంవత్సరలపాటు కఠోర తపస్సును ఆచరించింది. ఈ కారణంగానే అమ్మవారి చేతిలో జపమాల ... కమండలం కనిపిస్తూ వుంటాయి. ఈ అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరిస్తుంటారు. అయితే జాజిపూలు ... తులసి దళాలతో కట్టిన మాలతో అమ్మవారిని అలంకరించడం వలన ఆమెకి ప్రీతిపాత్రులవుతారని చెప్పబడుతోంది. ఈ అమ్మవారికి 'పులిహోర' అంటే చాలా ఇష్టం కనుక దానినే నైవేద్యంగా సమర్పించడం జరుగుతూ ఉంటుంది.
'' దధనాకర పద్మాభ్యం అక్షమాలా కమండలా .. దేవీ ప్రసాదతు మయి బ్రహ్మచారిణ్య నుత్తమా '' అంటూ అమ్మవారిని ఆరాధించడం వలన ఆ తల్లిమనసు వెన్నలా కరిగిపోతుందని చెప్పబడుతోంది. అమ్మవారి అనుగ్రహం వలన జీవితంలో వెంటాడుతూ వస్తోన్న సమస్యలు తొలగిపోయి సంతోషాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.