వివాహం ఆలస్యం కాకుండా ఉండాలంటే ?

వివాహం విషయంలో జాతకాలు ప్రధానపాత్రను పోషిస్తుంటాయి. అలాగే విద్య .. ఉద్యోగం ... కుటుంబ నేపథ్యం కూడా ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, తగిన సంబంధం దొరికితే తమ పిల్లలకు పెళ్లి చేసేయాలని తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారు. ఈ విషయంలో బంధుమిత్రుల మాటకు ప్రాముఖ్యతనిస్తూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు.

ఆశించిన స్థాయి సంబంధం దొరక్కపోవడం వలన ... జాతకాలు కలవక పోవడం వలన ఒక్కోసారి వివాహం విషయంలో ఆలస్యమవుతూ ఉంటుంది. ముందుగా అనుకున్న దానికంటే ఒకమెట్టు కిందకి దిగినా ప్రయోజనం కనిపించకుండా పోతుంది. దాంతో అమ్మాయిలు ... అబ్బాయిలకన్నా వాళ్ల తల్లిదండ్రులు మానసిక వత్తిడికి లోనవుతుంటారు.

ఏదో దోషం కారణంగానే ఇలా జరుగుతోందని భావించి, ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వివాహం విషయంలో ఆలస్యానికి గల కారణాలను తెలుసుకుని, వాటి నివారణకు తమవంతు కృషి చేస్తుంటారు. శీఘ్రమే వివాహం జరగడానికి అనేక పూజలు ... దానాల గురించి చెప్పడం జరుగుతోంది. వాటిలో సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఒకటిగా కనిపిస్తుంది.

విశిష్టమైనటువంటి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రానికి వెళ్లి ఆ స్వామికి మనసులోని మాటను చెప్పుకోవాలి. ఆ తరువాత ఆ క్షేత్రంలో 'కందులు' దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన వివాహానికి అడ్డుపడుతోన్న దోషాలు నివారించబడతాయట. ఫలితంగా మనసుకి నచ్చినవారితో అనతికాలంలోనే వివాహం జరుగుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News