భయమనేది ఇలా తొలగిపోతుందట !

చెప్పుకోవడానికి భయమనేది ఒకటిగా కనిపించినా, అది కలగడానికి అనేక రకాల కారణాలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా కొంతమంది చీకటి అంటే భయపడతారు. చీకట్లో ఒంటరిగా ఉండటానికి వీళ్లు అస్సలు ఇష్టపడరు. అందుకే స్నేహితులో ... బంధువులో ఎవరో ఒకరు తోడుగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు.

ఇంకొంతమందికి దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. దొంగలు వస్తారేమోననే ధ్యాస కారణంగా ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేస్తుంటారు. మరికొంతమందికి రాత్రివేళలో కురిసే వర్షమంటే భయపడిపోతుంటారు. ఇక ఆ వర్షానికి తోడు ఎక్కడైనా ఒక పిడుగుపడిన శబ్దం వచ్చిందంటే, భయంతో వీళ్లు చేసే హడావిడి ఇంతా అంతా కాదు. తమ దగ్గరలోనో ... తమపైనో పిడుగు పడిపోతుందేమోనని తీవ్రమైన భయాందోళనలకి లోనవుతుంటారు.

ఉరుములు ... మెరుపులు ... వర్షం ... వాళ్లకి ఓ భయంకరమైన దృశ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అందువలన ఆ సమయంలో తాము ఒంటరిగా ఉండకుండా చూసుకుంటారు. ఆకాశం ఉరుముతూ ఉంటే .. అర్జునుడు ఆవేశంతో రథంపై వెళుతున్నాడనే ఓ విశ్వాసం ప్రాచీనకాలం నుంచి ఉంది. అందువలన ఉరుముల శబ్దాలు వచ్చేటప్పుడు ఆయనని స్తుతించడం వలన శాంతిస్తాడని భావిస్తుంటారు.

ఈ కారణంగానే ''అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః బీభత్సుర్విజయః కృష్ణః సవ్యసానీ ధనుంజయః '' అనే శ్లోకాన్ని పఠించాలని పెద్దలు చెబుతుంటారు. ఉరుములు ... పిడుగులతో కూడిన వర్షం హోరున వస్తున్నప్పుడు, పిల్లలు భయపడుతూ వుంటే పెద్దలు ఈ శ్లోకం పఠిస్తూ ఉంటారు. ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం వలన, పిడుగులతో కూడిన వర్షం కారణంగా కలిగే భయం దూరమైపోతుందని చెప్పబడుతోంది.


More Bhakti News