శైలపుత్రిని ఇలా ఆరాధించాలి
దేవీ నవరాత్రులలో అమ్మవారు ఒక్కోరోజున ఒక్కోరూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ నవరాత్రులలో అమ్మవారు మొదటిరోజున 'శైలపుత్రి' గా అలంకరించబడి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. పర్వతరాజైనటువంటి హిమవంతుడి కుమార్తె కావడం వలన ఆమెను 'శైలపుత్రి' గా పిలుస్తుంటారు ... నిర్మలమైన భక్తితో కొలుస్తుంటారు.
ఈ అమ్మవారు 'వృషభ' వాహనంపై ప్రయాణం చేస్తూ ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం ... ఎడమ చేతిలో కమలం ధరించి ప్రసన్న వదనంతో కనిపిస్తుంది. నవరాత్రులలో తొలిరోజైన 'పాడ్యమి' రోజున శైలపుత్రిని మల్లెపూలతోగానీ ... బిల్వదళాలతో గాని అర్చించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అవి లభించని పక్షంలో ఆలయానికి వెళ్లి అలా అలంకరించబడిన అమ్మవారిని దర్శించినా అదే ఫలితం కలుగుతుంది.
ఇక అమ్మవారి సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆమెను ఆరాధించవలసి ఉంటుంది. ''వందే వాంఛిత లాభాయ చంద్రార్దాకృత శేఖరాం .. వృషారూఢమ్ శూలధరాం శైలపుత్రీం యశస్వినీం'' అంటూ అమ్మవారిని ఆరాధించడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. ఆమె కరుణా కటాక్షాల వలన జీవితంలో దేనికీ కొరత వుండదు. అమ్మ దయవలన అనేక విజయాలు ప్రాప్తిస్తాయి ... సకలశుభాలు చేకూరతాయి.