గంగ అదృశ్యమయ్యే గర్భాలయం !

శివకేశవులు కొలువైన క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతూ ఉంటాయి. అందువలన శివకేశవులు కొలువుదీరిన క్షేత్రాలను భక్తులు అధికసంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. అలా నిత్యం భక్తులచే నీరాజనాలు అందుకుంటోన్న శివకేశవ క్షేత్రాల్లో 'ర్యాలి' ముందువరుసలో కనిపిస్తుంది. ఇక్కడ 'జగన్మోహిని కేశవస్వామి' ఆలయంతో పాటు, దానికి ఎదురుగా అత్యంత సమీపంలో శివాలయం కూడా కనిపిస్తుంది.

జగన్మోహిని సమ్మోహన సౌందర్యాన్ని తిలకిస్తూ తనని తాను మరిచిపోయిన పరమశివుడు ఆమె వెనుకే ఇక్కడివరకూ వచ్చాడట. ఈ దృశ్యాన్ని చూసిన బ్రహ్మదేవుడు .. అందుకు గుర్తుగా తన కమండలంలో నుంచి శివలింగాన్ని సృష్టించి, ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాడని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి స్వామి 'ఉమాకమండలేశ్వర స్వామి' గా కొలవబడుతుంటాడు. జగన్మోహిని కేశవస్వామి పాదాల చెంత నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు.

ఇక ఉమాకమండలేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ఎన్ని బిందెల నీళ్లతో అభిషేకం చేసినా ఒక్క చుక్క నీరు బయటికిరాదు. గర్భాలయంలో నుంచి ఆ నీళ్లు బయటికి రావడానికి గానీ ... కిందనుంచి వెళ్లడానికి గాని ఎలాంటి మార్గం లేదు. అభిషేకం చేసిన నీరు చేసినట్టుగా అదృశ్యమైపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా కూడా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోంది.


More Bhakti News