స్వార్థపరుడి కళ్లు తెరిపించిన బాబా

మశీదునే మందిరంగా భావించి ... అందులో నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతోన్న బాబా దగ్గరికి ఎంతోమంది వచ్చి వెళుతూ వుండేవారు. వాళ్లు ఏ ఉద్దేశంతో వచ్చారో ... ఏం ఆశించి వచ్చారో బాబాకి వెంటనే తెలిసిపోతూ ఉండేది. అందువలన వాళ్లు కోరినది ధర్మమైనదా ... కాదా, దానిని పొందడానికి కావసిన అర్హత వాళ్లకి ఉందా లేదా అని ఆలోచించి బాబా అనుగ్రహించేవాడు.

ఒక్కోసారి ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్లను పరీక్షించి ... దాని ఫలితాన్ని బట్టి అనుగ్రహించేవాడు. అందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఒక వ్యాపారి మశీదులోని బాబాను దర్శించుకుంటాడు. అక్కడ చాలామంది ఉన్నప్పటికీ ఎలాంటి మొహమాటం లేకుండా, తనకి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని బాబాను కోరతాడు.

ఆయనకి ధన సంపాదనే ధ్యేయమనీ, ఎలాంటి పరిస్థితుల్లోను ఇతరులకి సాయపడని స్వార్థపరుడనే విషయం బాబాకి అర్థమైపోతుంది. సాధారణంగా తన దగ్గరికి వచ్చిన వాళ్లంతా ఆరోగ్యం ... ఐశ్వరం గురించి అడుగుతూ ఉంటారనీ, ఆయన బ్రహ్మజ్ఞానం గురించి అడిగినందుకు ఆనందంగా ఉందని చెబుతాడు. ఆయనతో మాట్లాడుతూనే అక్కడున్న ఒక పిల్లవాడిని పిలిచి ఫలానా వాళ్లని అడిగి ఒక అయిదు రూపాయలు తీసుకురమ్మని చెబుతాడు.

ఆ ఇంటిగల వాళ్లు లేరని వస్తే, మరో ఇంటికి పంపిస్తాడు. వాళ్లు లేవన్నారని ఆ పిల్లవాడు తిరిగిరాగానే మరొకరి దగ్గరికి పంపిస్తాడు. అక్కడి నుంచి వెంటనే తిరిగొచ్చి, ఆ ఇంటికి కూడా తాళంపెట్టి ఉందని ఆ పిల్లవాడు చెబుతాడు. ఇంత జరుగుతున్నా ఆ వ్యాపారి తన దగ్గర ఉన్నాయంటూ జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి తీయలేదు.

నిజానికి అయిదు రూపాయలతో తనకి ఎలాంటి అవసరం లేదనీ, బ్రహ్మజ్ఞానాన్ని కోరివచ్చిన ఆయనని పరీక్షించడానికే అలా చేశానని చెబుతాడు బాబా. జేబులో పెద్ద మొత్తంలో డబ్బుండి కూడా ఆయన అయిదు రూపాయలు బయటికి తీయకపోవడం గురించి ప్రస్తావిస్తాడు. ధనం పట్ల అంతటి వ్యామోహాన్ని పెంచుకున్న ఆయన బ్రహ్మజ్ఞానం గురించిన ఆలోచన చేయకూడదని చెబుతాడు. అశాశ్వతమైన బంధాల పట్ల ... తాత్కాలికమైన సుఖాలపట్ల వ్యామోహాన్ని పెంచుకున్న వాళ్లు బ్రహ్మజ్ఞానాన్ని పొందడం సాధ్యం కాదని స్పష్టం చేస్తాడు.


More Bhakti News