దుర్గాదేవిని ఈ పూలతో పూజించాలి
నవరాత్రులలో అమ్మవారి దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోరోజున అమ్మవారు ధరించే ఒక్కోరూపాన్ని దర్శించడానికీ ... ఆ తల్లి ఆశీస్సులు అందుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ప్రతి రూపంలోనూ అమ్మవారికి వివిధ రకాల బంగారు ఆభరణాలను ... పూల హారాలను అలంకరిస్తూ ఉంటారు. భక్తులు కూడా వివిధ రకాల పూలను అమ్మవారికి సమర్పిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే దేవతలకి ప్రీతికరమైన పూలను గురించి కొంతమంది ఆలోచన చేస్తుంటారు. కొన్నిరకాల పూలు కొంతమంది దేవతలకు ఇష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఆ పూలతో అర్చించినప్పుడు ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దుర్గాదేవికి ఏ పూలు ప్రీతికరమైనవో తెలుసుకుంటే ఆ పూలతో ఆమెని పూజించవచ్చని కొంతమంది భక్తులు అనుకోవడం జరుగుతూ వుంటుంది.
అమ్మవారికి అత్యంత ఇష్టమైన పూలజాబితాలో మనకి 'మల్లెలు' .. 'జాజులు' .. 'సంపెంగలు' .. 'పున్నాగులు' .. 'గన్నేరులు' .. 'కలువలు' .. 'తామరలు' .. 'తుమ్మిపూలు' కనిపిస్తూ ఉంటాయి. ఈ పూలతో దుర్గాదేవిని పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇలా అమ్మవారికి ఇష్టమైన పూలతో అర్చించడం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ, మనోభీష్టాలు నెరవేరతాయని స్పష్టం చేస్తున్నాయి.