పాపాలను పటాపంచలుచేసే గంధవతి
సాధారణంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లిన వాళ్లు అక్కడి పుణ్యతీర్థాలలో తప్పనిసరిగా స్నానమాచరిస్తూ ఉంటారు. అలా ముందుగా పుణ్యతీర్థాన్ని దర్శించి .. అందులో స్నానం చేసిన తరువాత దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన సమస్తపాపాలు నశించి విశేష పుణ్యఫలాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు.
అయితే అసలు ఎన్నో జన్మల పుణ్యం వెంటవస్తేనే తప్ప కొన్నితీర్ధాలలో స్నానంచేసే అవకాశం లభించదు. అలాంటి విశిష్టతను సొంతం చేసుకున్న పుణ్యతీర్థాలలో 'గంధవతీ తీర్థం' ఒకటిగా చెప్పబడుతోంది. పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న ఈ తీర్థం ... 'త్రిపురాంతకం'లో కనిపిస్తుంది. శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదని స్థలపురాణం చెబుతోంది.
సమస్త దేవతలు ఈ గంధవతీ తీర్థంలో కొలువై ఉంటారనీ, అందువలన ఇది దివ్యతీర్థమని అంటారు. అలాంటి ఈ తీర్థంలో స్నానం చేయడం వలన అనేక యజ్ఞయాగాలు చేసిన ఫలితం కలుగుతుందట. ఇందులో స్నానం చేసిన కారణంగా పుణ్యరాశి అంతకంతకూ పెరిగిపోతుందని విశ్వసిస్తుంటారు. సమస్త పాపాలని నశింపజేసే గంధవతీ తీర్థం ... దర్శన మాత్రం చేతనే మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదించే త్రిపురాంతకేశ్వరుడు నెలకొని ఉన్న కారణంగా ఇది మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.