శ్రీశైల క్షేత్రంలో అమ్మవారి వైభవం

అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో 'దేవీనవరాత్రులు' అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఒక్కోరోజున ఒక్కో రూపంలో ... వివిధ అలంకరణలతో నవదుర్గలుగా దర్శనమిస్తూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో స్వామివారు కూడా వివిధ వాహనసేవలతో భక్తులను అనుగ్రహిస్తుంటాడు.

మొదటి రోజున అమ్మవారిని 'శైలపుత్రి' గా .. రెండవ రోజు 'బ్రహ్మచారిణి' గా .. మూడవరోజున 'చంద్రఘంట' గా .. నాల్గొవ రోజున 'కూష్మాండ' గా .. ఐదవరోజున 'స్కందమాత' గా ... ఆరో రోజున 'కాత్యాయని' గా .. ఏడో రోజున 'కాళరాత్రి' గా .. ఎనిమిదవ రోజున 'మహాదుర్గ' గా .. తొమ్మిదో రోజున 'సిద్ధిదాత్రి' గా అలంకరిస్తారు.

ఇక పదో రోజున అంటే దశమి రోజున అమ్మవారు 'భ్రమరాంబాదేవి'గా నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ రోజుల్లోనే ఇక్కడ 'కుమారీ పూజ' ... 'సువాసినీ పూజ' ... 'దంపతి పూజ'లు నిర్వహిస్తుంటారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడి స్వామివారికి 'భ్రుంగి' ..' మయూర' .. 'రావణ' .. 'కైలాస' .. 'శేష' .. 'హంస' .. 'గజ' .. 'నంది' ... 'అశ్వ' వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు.

అందరినీ ఆదరించేది ... అనుగ్రహించేది ఆ అమ్మవారే గనుక, ఆ తల్లి ఉత్సవాల్లో పాల్గొనడమే అదృష్టంగా భక్తులు భావిస్తుంటారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ నవరాత్రోత్సవాలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవారి ఆశీస్సులు అందుకుని తరిస్తుంటారు.


More Bhakti News