ఈ స్వామికి ఎర్రనిపూలు ఇష్టమట !

తమ పట్ల ఎవరికైనా మంచి అభిప్రాయం కలగాలన్నా ... అభిమానం పెరగాలన్నా అవతలివారి ఇష్టాయిష్టాలను తెలుసుకుని మసలుకోవడం జరుగుతూ ఉంటుంది. అవతలవారి ఇష్టానికి తగినట్టుగా నడచుకోవడం వలన వాళ్లు సంతోషించి, అవసరమైనప్పుడు తమ సహాయ సహాకారాలను అందించడం జరుగుతూ ఉంటుంది. భగవంతుడిని ప్రసన్నం చేసుకునే విషయంలోను ఇదే పద్ధతి కనిపిస్తూ ఉంటుంది.

ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి గాను ఆ దైవానికి ఇష్టమైన వస్త్రాలను ధరించడం ... నియమాలు పాటించడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయా దైవాలకు ఇష్టమైన పూలను సమర్పించడం వలన వారి అనుగ్రహం వెంటనే లభిస్తుందని చెప్పబడుతోంది. పూలు పూసేదే భగవంతుడి కోసమనీ ... ఆ పూలకు గల సహజమైన పరిమళం ఆయన సేవకోసమేనని చెబుతుంటారు.

ఈ పూలలో వివిధ వర్ణాలకు ... జాతులకు సంబంధించినవి ఉంటాయి. కొన్ని వర్ణాలు గల పూలతో పూజించడం వలన, వాటిని ఇష్టపడే దేవతలు తమ కరుణా కటాక్షాలను కురిపిస్తారు. అలా కుమారస్వామి అనుగ్రహాన్ని ఆశించేవాళ్లు 'ఎర్రనిపూలు'తో పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ స్వామికి ఎర్రనిపూలు ఎంతో ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి.

విజయంతో పాటు సకల శుభాలనొసగే దైవంగా కుమారస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. అసమానమైన విశ్వాసంతో ఆయనని ఆరాధించడం వలన అనేక దోషాలు ... పాపాలు తొలగిపోతాయి. అలాంటి స్వామిని ఈ పూలతో స్వామిని సేవించడం వలన ఆయన సంతోషిస్తాడు. అంకితభావంతో తనని ఆరాధించినవారికి జీవితంలో ఎలాంటి లోటు లేని విధంగా అనుగ్రహిస్తాడని చెప్పబడుతోంది.


More Bhakti News