సంతాన శ్రేయస్సుకై గణపతి పూజ
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలే లోకంగా బ్రతుకుతుంటారు. వాళ్ల మనసుకి కష్టం కలిగినా ... అనారోగ్యానికి గురైనా తల్లడిల్లిపోతారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు పంతాలకు పోవడం చాలా అరుదు. పిల్లలు తమని అర్థం చేసుకోలేని సందర్భం వచ్చినప్పుడు తామే ఒకమెట్టు దిగడానికి సైతం వాళ్లు సిద్ధపడతారు.
తమ పిల్లల అవసరాలు తీర్చడానికీ ... వాళ్ల కోరికలు నెరవేర్చడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ల భవిష్యత్తు బాగుండాలని సదా ఆకాంక్షిస్తూ ఉంటారు. అందుకోసం ఎన్ని కష్టాలైనా పడతారు ... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కుంటారు. ఇక గుడికి వెళ్లినా తమ పిల్లలను గురించే దైవానికి చెప్పుకుంటారు.
పిల్లల ఆరోగ్యం ... విద్య ...ఉద్యోగం ... వివాహం ... సంతానం ... సంపద ఇలా వాళ్లకి ఏది అవసరమనిపిస్తే అది ఆ భగవంతుడిని కోరతారు. తమ చేతిలో ఉన్నంత వరకూ పిల్లల కలలు నిజం చేయడానికే ప్రయత్నిస్తారు. ఆ తరువాత భారం ఆ దేవుడిపైనే వేస్తుంటారు.ఈ విషయంలో ఎంతటి కష్టతరమైన మొక్కులను చెల్లించడానికైనా వాళ్లు సిద్ధపడతారు.
సాధారణంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధిని కలిగించే విషయంలో విఘ్నేశ్వరుడిని పూజించడం జరుగుతుంది. అంతేకాదు ఆ స్వామి ఆరాధనా ఫలితం వలన సంతాన శ్రేయస్సు కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సంతాన శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు గణపతిని పూజిస్తూ ఉండటం వలన, ఆశించిన ఫలితాలు అనతికాలంలోనే కనిపిస్తాయని స్పష్టం చేస్తున్నాయి.