భయాన్ని దూరంచేసే భక్తి
మహాభక్తుల జీవితాలను పరిశీలిస్తే తమ ఇష్టదైవాన్ని సేవించడం ... కీర్తించడం తప్ప వాళ్లకి మరోధ్యాస ఉండేదికాదనే విషయం స్పష్టమవుతూ ఉంటుంది. వాళ్లు భగవంతుడిని మాత్రమే స్తుతిస్తారు ... ఆయన లీలావిశేషాలను మాత్రమే కీర్తిస్తారు. అంతే గాని తమ జీవనం సుఖంగా సాగిపోవడం కోసం ఖరీదైన కానుకలను ఆశించి రాజులను ప్రశంసించరు.
అందరికీ ఆ భగవంతుడే యజమాని ... అంతా ఆయన ఆజ్ఞను అనుసరించి నడచుకోవాలి అనే విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా భగవంతుడు మాత్రమే గొప్పవాడు ... ఇక మానవ మాత్రులంతా నిమిత్తమాత్రులే అన్నట్టుగా నడచుకున్న మహాభక్తులు రాజుల ఆగ్రహానికి గురైన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అలా రాజు ఆగ్రహానికి గురైన భక్త కవులలో 'గంగ మహాకవి' ఒకరుగా కనిపిస్తాడు.
అక్బర్ ఆస్థానంలో కవిగా 'గంగ మహాకవి' తన ప్రత్యేకతను చాటుకుంటాడు. అయితే ఆయన తాను కవినని చెప్పుకోవడానికన్నా ఆ భగవంతుడి పాదదాసుడినని చెప్పుకోవడానికే ఎక్కువగా ఇష్టపడేవాడు. ఆయన కవిత్వాన్ని ఇష్టపడిన అక్బర్ ... తనని ప్రశంసిస్తూ కవిత్వం చెప్పమని అడుగుతాడు. తాను భగవంతుడి గుణగణాలను మాత్రమే కీర్తిస్తానంటూ ఆయన అభ్యర్థనను గంగ మహాకవి సున్నితంగా తిరస్కరిస్తాడు.
ప్రభువుల కోరికను తిరస్కరించడం ఆయనను అవమానపరచడమేనంటూ మిగతా పండితులు ఆ విషయాన్ని పెద్దది చేస్తారు. వాళ్ల ధోరణి అక్బర్ ఆవేశం పెరగడానికి కారణమవుతుంది. అయినా గంగ మహాకవి మనసు మార్చుకోకపోవడంతో అక్బర్ ఆయనకి మరణశిక్షను విధిస్తాడు. తాను భగవంతుడిలో ఐక్యమయ్యే సందర్భం ఇలా వచ్చిందంటూ గంగ మహాకవి ఆనందంగా అందుకు సిద్ధపడతాడు.