ఏ వైపుకి తిరిగి నిద్రకి ఉపక్రమించాలి ?
సాధారణంగా వివిధ పనుల వత్తిడి వలన అలసిపోయి ఇంటికి చేరుకున్న వాళ్లు వెంటనే మంచంపై వాలిపోతుంటారు. హాయిగా నిద్రపోయి ఉదయాన్నే ఉత్సాహంగా తిరిగి తమ పనిపై బయటికి వెళ్లిపోతుంటారు. ఎప్పటిలానే కష్టపడి వచ్చి మంచంపై వాలిపోయినా ఒక్కోసారి తొందరగా నిద్రపట్టదు.
దాంతో ఏదో తెలియని అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు ఎవరితోనో మాట్లాడిన మాటలు గుర్తుకువస్తూ వుంటాయి. సంబంధం లేని ప్రశ్నలకు మనసు సమాధానాలు చెబుతూ ఉంటుంది. నిద్ర పట్టీపట్టనట్టుగా అనిపించడం ... ఆ స్థితిలోనే అర్థం పర్థం లేని దృశ్యాలు కళ్లముందు కదలాడటం జరుగుతుంది. ఆ రాత్రంతా నిద్రకి దూరమైపోయి ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తే అందుకు సమాధానం దొరకదు. 'నిద్ర' అనేది ఎంతటి అపురూపమైన వరమో ... అది పట్టనప్పుడు తెలుస్తుంది. నిద్ర పట్టడం ... పట్టకపోవడం అనేది పూర్తిగా మనసుపై ఆధారపడి ఉంటుంది. మానసికపరమైన ఆందోళనకి లోనుకావడం ... సరైన తీరులో పడుకోకపోవడం వలన ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది.
హాయిగా నిద్రపట్టాలంటే ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే నిద్రకి ఉపక్రమించే ముందు ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. ఆ తరువాత ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఎడమవైపుకి తిరిగి పడుకోవాలి. వైద్యశాస్త్రం కూడా ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతోంది. అలా నిద్రపోయిన వాళ్లు ఉదయాన్నే మెలకువ వచ్చినప్పటికీ ఒక్కసారిగా మంచం దిగకూడదు.
ఇష్ట దైవాన్ని మనసులో తలచుకుని కుడివైపుకి తిరిగి నిదానంగా లేవవలసి ఉంటుంది. అలా అని రాత్రంతా ఒకేవైపుకి తిరిగి పడుకోవాలని అర్థం చేసుకోకూడదు. మెలకువగా ఉన్నప్పుడు ఎడమవైపుకి తిరిగి పడుకోవడానికి ప్రయత్నించాలి. దైవనామ స్మరణతో మనసును ప్రశాంతం చేసుకోవడం వలన ... ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వలన హాయిగా నిద్రపడుతుందని చెప్పబడుతోంది.