అమ్మవారి కృపకు వీరే పాత్రులవుతారు

లోక కల్యాణం కోసం అనేక రూపాలను ధరించిన అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే, పవిత్రమైన హృదయాల్లో ఉంటుంది .. సత్యధర్మాలను అనుసరించేవారి ఇంట ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందుకే అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే సత్యమును ఆశ్రయించి ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి.

అప్పుడు అమ్మవారు తన సత్యమును చూపుతుందనీ, తన భక్తుల కోరికలను నెరవేరుస్తుందని చెప్పబడుతోంది. అలా సత్యం చూపించే అమ్మవారు మనకి 'తిమ్మరాజు పాలెం' లో దర్శనమిస్తుంది. 'నిడదవోలు' సమీపంలో గల ఈ క్షేత్రంలో తొమ్మిది అడుగుల అమ్మవారి స్వయంభువు విగ్రహం దర్శనమిస్తుంది. మంత్రముగ్ధులను చేసే అమ్మవారి మూర్తి పొలం దున్నుతూ ఉండగా లభించిందట.

శంఖు చక్రాలను ... 'గద'ను కలిగివున్న అమ్మవారు అభయ హస్తంతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని సత్యం కలిగిన తల్లిగా గుర్తించిన గ్రామస్తులు ఆమెని 'సత్తెమ్మ తల్లి'గా కొలుస్తుంటారు. ఈ అమ్మవారు ఎక్కడైతే దొరికిందో అక్కడే ఉంచి ఆరాధించడం మొదలు పెట్టారట. అయితే ఎవరికైతే అమ్మవారు ముందుగా కనిపించిందో, ఆ వ్యక్తికే కలలో కనిపించి తనకి అక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట.

అలా ఆ వ్యక్తి పూనుకోవడం ... గ్రామస్తులు సహకరించడం కారణంగా ప్రస్తుతమున్న ఆలయం దర్శనమిస్తోంది. అమ్మవారు ఇచ్ఛాపూర్వకంగా ఇక్కడ ఆవిర్భవించినది కనుక ఇది మహిమాన్వితమైన క్షేత్రమని విశ్వసిస్తుంటారు. అమ్మవారు సూచించిన విధంగా నడచుకుంటే వెంటే ఉంటూ కాపాడుతుందని చెబుతుంటారు. సత్యధర్మాలకు కట్టుబడిన వారిపైనే ఆమె కృప ఉంటుందని అంటారు. అందుకు నిదర్శనంగా తమ అనుభవాలను ఆవిష్కరిస్తూ ఉంటారు.

శరన్నవ రాత్రులలో ఒక్కో రోజున అమ్మవారిని ఒక్కోరూపంగా అలంకరించి పూజిస్తుంటారు. ఈ సమయంలో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలలో ... సేవలలో పాల్గొనడానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. మహిమగల తల్లిని మనసారా కొలుస్తుంటారు.


More Bhakti News