నిజమైన భక్తికి భగవంతుడు వశమవుతాడు
పాండురంగస్వామిని నిత్యం సేవించి తరించిన మహా భక్తులలో 'నామదేవుడు' ఒకడుగా కనిపిస్తాడు. అలాంటి నామదేవుడి బాల్యంలో జరిగిన ఒక సంఘటన ఆయన భక్తిశ్రద్ధలను చాటిచెబుతుంది. నామదేవుడి తల్లిదండ్రులు దామాసేఠ్ - గోణాయి పాండురంగస్వామికి పరమభక్తులు. ఆ ఇంట్లో ఏది చేసినా ముందుగా ఆ స్వామికి సమర్పించకుండా స్వీకరించేవారు కాదు.
ఒకసారి పనిమీద బయటికి వెళ్లిన దామాసేఠ్, స్వామివారికి నైవేద్యం పెట్టవలసిన సమయానికి తిరిగి రాలేకపోతాడు. దాంతో తల్లి కోరిక మేరకు పాండురంగడికి నైవేద్యం తీసుకుని ఆలయానికి వెళతాడు నామదేవుడు. బాలుడు కావడం వలన భగవంతుడు నిజంగానే వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తాడని అనుకుంటాడు.
ఆయన ఎంతకీ రాకపోవడంతో మారాం చేస్తాడు. దాంతో స్వామి వచ్చి ఆ నైవేద్యాన్ని ఆరాగించి అదృశ్యమవుతాడు. నైవేద్యాన్ని గురించి అడిగిన తల్లిదండ్రులకి ... స్వామి ఆరగించాడని చెబుతాడు నామదేవుడు. అతని మాటలను నమ్మలేక ... అలాగని చెప్పి కొట్టిపారేయలేక వాళ్లు సతమతమైపోతారు. సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం, మరునాడు వాళ్లు ఆయనని అనుసరిస్తూ వెళతారు.
నామదేవుడు స్వయంగా స్వామికి తినిపిస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. తమ కుమారుడి నిర్మలమైన భక్తి స్వామివారి మనసును గెలుచుకుందని గ్రహిస్తారు. ఆయన వలన సాక్షాత్తు పరమాత్ముడినే దర్శించే భాగ్యం కలిగినందుకు ఆ దంపతులు సంతోషంతో పొంగిపోతారు.