భయాలను నివారించే దుర్గాదేవి
భయం అంటే తెలియని వాళ్లు ... జీవితంలో ఏదో ఒక సందర్భంలో భయానికి లోనుకాని వాళ్లంటూ ఉండరు. కొంతమందిని కొన్ని సంఘటనలు ... మరికొంతమందిని కొన్ని జ్ఞాపకాలు భయపెడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భయమనేది బలహీనతగా కూడా మారిపోతుంటుంది.
జీవితంలో భయమనేది ప్రతి విషయంలోనూ వెనక్కిలాగుతూ ఉంటుంది. అనేక అపజయాలకు అది ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటుంది. భయం లేకుండా అడుగు ముందుకు వేసిన ప్రతిసారీ విజయం వరించకపోవచ్చు. అయినా ధైర్యంగా పోరాడామనే సంతృప్తి కలుగుతుంది. కారణమేదైనా భయం బారి నుంచి బయటపడటానికి ఏంచేయాలో పాలుపోని వాళ్లు చాలామందే కనిపిస్తుంటారు.
ఈ నేపథ్యంలో భయానికి అసలైన విరుగుడు 'దుర్గాదేవి' నామస్మరణేనని ఆధ్యాత్మిక గ్రంధాలు అంటున్నాయి. దుర్గాదేవిని ఆరాధించడం వలన దుర్గతులు నశిస్తాయని చెప్పబడుతోంది. అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం వలన దారిద్ర్యం ... దుఃఖం నశించడమే కాదు, భయం కూడా నివారించబడుతుందని స్పష్టం చేయబడుతోంది.
భయానికి లోనైనప్పుడు '' సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే ... భయోభ్య స్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే'' అని అమ్మవారిని ప్రార్ధించడం వలన భయమనేది దూరమవుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.