ఇంటింటా బతుకమ్మ సందడి
'బతుకమ్మ' పండుగ రోజుల్లో తెలంగాణ ప్రాంతమంతా కూడా కొత్తకళను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ తొమ్మిది రోజుల్లో ప్రతి ఇంట్లో సంతోషం కనిపిస్తుంది ... సందడి వినిపిస్తుంది. ఆడపిల్లలు చేసే పూజలే వారికి అమ్మవారి అనుగ్రహాన్ని కలిగేలా చేస్తుంటాయి. అలాంటి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందించే పండుగగా 'బతుకమ్మ' కనిపిస్తుంది.
బతుకమ్మ అనేది అందరినీ కలుపుకుని ఆడే ఆట. అందువలన ఆయా వయసుల వారి మధ్య సఖ్యత పెరగడానికి ఈ పండుగ ఒక వేదికగా దోహదపడుతూ ఉంటుంది. అంతా కలిసి పూలను సేకరించినా ... బతుకమ్మను పేర్చడంలో ఎవరి నైపుణ్యం వారిది. ఒకరికంటే ఒకరు అందంగా బతుకమ్మను పేర్చడంలో పోటీలు పడుతుంటారు. ఇతరుల బతుకమ్మలు ఎలా ఉన్నాయో చూడాలనే ఆసక్తితో ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగిస్తుంటారు.
దాంతో ఊరంతా సందడి చేస్తూ ... కనువిందు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ కాలంలో లభించే తంగేడు ... గునుగు ... బంతి వంటి వివిధ రకాల పూలను బతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తూ ఉంటారు. 'అష్టమి' రోజున ప్రత్యేకంగా 'సద్దుల బతుకమ్మ'ను పేరుస్తారు. అమ్మవారు అవతరించిన రోజు అష్టమి కావడమే ఈ ప్రత్యేకతకు కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక తొమ్మిది రోజుల పాటు జరిపే పండుగ కావడం వలన, నవరాత్రుల సందర్భంలో జరిపే పండుగ కావడం వలన కొంతమంది తొమ్మిది రకాల పూలను బతుకమ్మ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తొమ్మిది అనేది 'నవవిధ భక్తి' కి సంకేతంగా చెబుతుంటారు. శివలింగాకృతిలో పేర్చిన పూలను గౌరమ్మగా భావించి గంగలో వదలడం ఈ పండుగలో దాగిన పరమార్థంగా అనిపిస్తుంది. అందరినీ ఒకచోట చేర్చేది ... అందరినీ ఒక్కటిగా చేసేదే పండుగ అయితే, ఆ పండుగ లక్షణాన్ని పరిపూర్ణంగా సంతరించుకున్న ఘనత బతుకమ్మకే దక్కుతుంది.