తిరుమలను పోలిన బాలాజీ క్షేత్రం

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూలోకానికి దిగివచ్చి వేంకటేశ్వరుడుగా ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రం 'తిరుమల'. ఈ క్షేత్రంలో అడుగుపెట్టాలన్నా ... ఇక్కడి స్వామిని దర్శించుకోవాలన్నా పూర్వజన్మ పుణ్యం వెంటరావాలి. నిరంతరం స్వామివారి దర్శనం కోసం లక్షలాదిమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు. ఆ ఏడుకొండలవాడిని దర్శించుకుని మురిసిపోతుంటారు.

ఇక్కడి స్వామిని అనునిత్యం దర్శించుకోవాలనే ఉద్దేశంతో కొంత్తమంది భక్తులు ఆయా ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించి, అచ్చు తిరుమల వేంకటేశుడిని పోలిన ప్రతిమను ప్రతిష్ఠించుకున్న సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఒక భక్తుడు తిరుమల స్వామివారినే కాదు, తిరుమల ఆలయాన్ని పోలిన ఆలయాన్నే నిర్మించాడు.

వేంకటేశ్వర హేచరీస్ అధినేత అయిన బి.వి.రావు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పూణే - 'కేట్కావాలా' గ్రామంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఎత్తయిన కొండల మధ్య కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ ఆలయం ఆయన భక్తి శ్రద్ధలకు నిదర్శనమై దర్శనమిస్తుంది. అడుగడుగునా సౌందర్యం ఉట్టిపడుతోన్న రూపంతో భారీగా కొలువైన ఇక్కడి స్వామివారిని 'బాలాజీ' గానే భక్తులు పిలుస్తుంటారు.

ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకూ కూడా తిరుమలలో వున్నామనే అనుభూతే కలుగుతూ ఉంటుంది. భక్తులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తూ, ఆధ్యాత్మిక భావాలను వికసింపజేసే ఈ క్షేత్రాన్ని చూసితీరవలసిందే. ఈ స్వామికి ఘనంగా జరిగే వివిధ సేవలను కనులారాదర్శిస్తూ ధన్యులు కావలసిందే.


More Bhakti News