మొక్కుకుంటే దానిని చెల్లించవలసిందే !
కష్టాల్లో ... నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోమంటూ తాము నమ్మిన భగవంతుడిని వేడుకోవడం జరుగుతుంది. తమని ఆ గండం నుంచి గట్తెక్కిస్తే ఫలానాది సమర్పించుకుంటామని మొక్కుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ కష్టం తీరిన తరువాత ఆ మొక్కు గురించి కొంతమంది మరిచిపోతుంటారు. గుర్తు ఉన్నప్పటికీ ఇంకొందరు వాయిదా వేస్తూ ఉంటారు.
అయితే శిరిడీ సాయిబాబా ... అక్కల్ కోట స్వామి వంటి అవధూతలు మాత్రం తమకి చెల్లించిన వలసిన మొక్కులను గురించి భక్తులకు గుర్తుచేసిన సంఘటనలు ... సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కల్ కోట సమీప గ్రామంలో నివసించే ఒక వ్యక్తి ఒకసారి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు. స్వామిపట్ల ఆయనకి విశ్వాసం ఉండటంతో, తన ఆరోగ్యం కుదుటపడితే ఆయనకి ఇష్టమైన పాలకోవాలు తీసుకువస్తానని మొక్కుకుంటాడు.
ఆయన అలా మొక్కుకున్న తరువాత మంచి ఫలితం కనిపిస్తుంది. వ్యాధి బారి నుంచి బయటపడిన ఆయన మొక్కు విషయాన్ని మరిచిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. స్వామివారి దర్శనం చేసుకోవాలనిపించడంతో, ఆయన అక్కల్ కోటకి చేరుకొని స్వామి సన్నిధికి చేరుకుంటాడు. స్వామి ఆశీస్సులు అందుకోవడానికి ప్రయత్నించగా, తనకి ఇవ్వవలసిన పాలుకోవాల మాటేమిటని అడుగుతాడు స్వామి. అసలు ఆ మొక్కు విషయమే గుర్తుకులేని ఆ వ్యక్తి స్వామి వైపు అయోమయంగా చూస్తాడు.
గతంలో అతనికి కలిగిన అనారోగ్యం ... ఆ సమయంలో అతను అనుకున్న మొక్కుని స్వామి గుర్తుకుచేస్తాడు. తనని మన్నించమంటూ కోరిన ఆ వ్యక్తి, వెంటనే వెళ్లి పాలుకోవాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తాడు. స్వామివారు అందరి భక్తులను ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటాడనీ, ఆయన అనుగ్రహంతోనే అన్నీ జరుగుతూ ఉంటాయనే విషయం ఆ భక్తుడికి అనుభవంలోకి వస్తుంది. దాంతో ఆయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.