పళని మూలమూర్తి విశేషం ఇదే !
సాధారణంగా కుమారస్వామి కొలువైన ఏ ఆలయానికి వెళ్లినా ఆ స్వామి వివిధ రకాల ఆభరణాలను ధరించి నయనానందకరంగా దర్శనమిస్తూ ఉంటాడు. కిరీటం ... మెడలో రత్నాభరణాలు ... పూలహారాలతో పట్టువస్త్రాలు ధరించి కనిపిస్తూ తన వైభవాన్ని చాటుతూ ఉంటాడు.
ఇక ప్రసిద్ధి చెందినటువంటి 'పళని' క్షేత్రంలో మాత్రం ఆయన ఇందుకు భిన్నంగా దర్శనమిస్తూ ఉంటాడు. తమిళనాడు ప్రాంతంలోని ఈ పుణ్యక్షేత్రం కుమారస్వామికి సంబంధించిన అత్యంత విశిష్టమైన క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతూ వుంది. అలాంటి ఈ క్షేత్రంలో స్వామివారు కిరీటం .. ఆభరణాలు .. పట్టువస్త్రాలు లేకుండా, కేవలం రుద్రాక్షలు .. కౌపీనం మాత్రమే ధరించి కనిపిస్తుంటాడు.
ఇంతటి విశేషమైన ఆలయంలో స్వామివారి మూర్తి ఇంత నిరాడంబరంగా దర్శనమిస్తూ ఉండటానికి గల కారణమేవై ఉంటుందనే సందేహం సహజంగా కలుగుతూ ఉంటుంది. ఒకానొక విషయంలో గణపతికీ ... కుమారస్వామికి శివపార్వతులు పరీక్ష పెడతారు. అన్ని పుణ్యతీర్థాలలో స్నానమాచరించి విజయం సాధించడం కోసం, కుమారస్వామి వెంటనే అక్కడి నుంచి నెమలివాహనంపై బయలుదేరుతాడు.
తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే సమస్త పుణ్యతీర్థాలను దర్శించిన ఫలితం వస్తుందని భావించిన వినాయకుడు అలాగే చేస్తాడు. అలా చేసిన వినాయకుడిని పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహిస్తారు. దాంతో కుమారస్వామి మనసు నొచ్చుకుంటుంది. తల్లిదండ్రులపై అలిగి ... తన ఆభరణాలను కైలాసంలో వదిలి ఇక్కడికి వచ్చేస్తాడు. అందువల్లనే ఆయన ఎలాంటి ఆభరణాలు ... అలంకారాలు లేకుండా ఇక్కడ ఇలా దర్శనమిస్తూ ఉంటాడని చెబుతుంటారు.