తమలపాకులతో పూజా ఫలితం !

ఆపదలో ఉన్నప్పుడు హనుమంతుడిని తలచుకుంటే చాలు క్షణాల్లో ఆయన అక్కడికి చేరుకుంటాడు. తన భక్తులను ఆ గండం నుంచి గట్టెక్కించి సంతోషపడిపోతుంటాడు. ఇక ఆయన అనుగ్రహంతో కష్టాల నుంచి బయటపడిన వాళ్లు పెద్ద మొత్తంలో ఖర్చుచేసి ఆయనకి మొక్కులు చెల్లించుకోవలసిన పనిలేదు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రదక్షిణలు చేసినా, తమలపాకులతో పూజ చేసినా సంతృప్తి చెందుతాడు.

సాధారణంగా ఏ దైవాలకైనా పూజ అనగానే వివిధ రకాల పూలతో చేయించడం జరుగుతూ ఉంటుంది. ఇక హనుమంతుడి పూజ విషయానికి వచ్చేసరికి పూలతో కూడిన పూజతో కన్నా ఆకు పూజకే అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. హనుమంతుడికి ఆకు పూజ చేయించడం వలన అనేక గండాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.

ఆకు పూజ ఆయనకి ప్రీతికరమైనది కావడానికి వివిధ రకాల కారణాలు చెప్పబడుతున్నాయి. వాటిలో ఆసక్తికరమైన ఓ కారణం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.

సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు ... ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు చెప్పబడుతోంది.

ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ ఆయన పడిన శ్రమను మరిచిపోయి సంతోషంతో పొంగిపోయాడట. తలపాకులతో పూజను ఆయన ఇష్టపడటానికీ ... వాటితో అర్చించిన వాళ్లని ఆయన వెంటనే అనుగ్రహించడానికి కారణం ఇదేనని చెబుతుంటారు. ఈ కారణంగానే ఆపదల నుంచి ... అవసరాల నుంచి బయటపడినవాళ్లు ఇప్పటికీ హనుమంతుడికి ఆకు పూజ చేయిస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహంతో ఆయురారోగ్యలను పొందుతుంటారు


More Bhakti News