నవరాత్రులలో ఉపవాసం
నవరాత్రులలో ఉపవాసనికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఈ తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారిని పూజిస్తుంటారు. తమ ఆరోగ్య స్థితిని బట్టి కొందరు ఈ రోజుల్లో ఒకపూట మాత్రమే భోజనం చేస్తుంటారు. మరికొందరు ఒకపూట భోజనం చేసి రాత్రికి అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.
సంపద .. సౌభాగ్యం .. విజయాలు అందించేది ఆ తల్లే కనుక, అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ ఉపవాసదీక్షను చేపడుతూ ఉంటారు. రుచికి సంబంధించిన దేనిపైకి మనసు వెళ్లకుండా అమ్మవారి పాదపద్మాలపైనే మనసు నిలవడం కోసం ఉపవాసం చేస్తుంటారు. ఆహారాన్ని పరిమితంగా తీసుకోవడమనేది ఒక నియమం మాత్రమేననీ శాస్త్రం చెబుతోంది. ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండటమని స్పష్టం చేస్తోంది.
అమ్మవారి సన్నిధిలో ... పూజలో ఉన్నంతసేపు మనసు ఆమెపైనే ఉండాలి. ప్రశాంతంగా కూర్చుని తదేకంగా ఆమెని దర్శిస్తూ వుండాలి. భక్తి శ్రద్ధలతో ఆ తల్లి నామాన్ని స్మరిస్తూ ... కీర్తిస్తూ ఉండాలి. లోక కల్యాణం కోసం ఆ తల్లి ధరించిన రూపాలను గుర్తుచేసుకుంటూ ఉండాలి. అమ్మవారిని సేవిస్తూ సత్సంగం చేస్తూ ఆమె ఆరాధనలో తరించవలసి ఉంటుంది. అప్పుడే అనురాగమయి అయిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
ఇక ఆహార నియమం ప్రకారం చెప్పుకునే ఉపవాసం ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగాను ఎంతో మేలు చేస్తుందని వైద్యశాస్త్రం చెబుతోంది. అయితే ఉపవాసం అనేది నియమబద్ధంగా చేస్తూ ఉండాలి. జీర్ణం కాకుండా ఉన్న ఆహారం ఉపవాసం వలన జీర్ణమవుతుందని చెప్పబడుతోంది. ఉపవాసం వలన జీర్ణకోశం శుభ్రపడటమే కాకుండా, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి. అందువలన ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారి సన్నిధిలో ఉపవసించడం వలన ఆరోగ్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా ఆశించే పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.