పాపాలను కడిగేసే మానసగంగ !

పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు ... గోపాలకుడిగా తన స్నేహితులతో ఆటపాటలాడిన పవిత్ర ప్రదేశంగా, అందాల రాధను ఆటపట్టించిన పుణ్యస్థలిగా 'బృందావనం' కనిపిస్తుంది. ప్రాచీనతను సంతరించుకున్న ఇక్కడి వస్తువులు గోపాలకులతో కృష్ణుడు చేసిన సందడిని మనతో చెప్పడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా అనిపిస్తుంటాయి. రాధాకృష్ణులకి సంబంధించిన రమణీయ దృశ్యాలను మనోఫలకంపై అందంగా ఆవిష్కరిస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి.

అడుగడుగునా అనుభూతి పరిమళాలను వెదజల్లే బృందావనంలో అన్నీ చూడదగిన ప్రదేశాలే. అలాంటి వాటిలో ఒకటిగా 'మానసగంగ' కనిపిస్తుంది. ఇది సాక్షాత్తు కృష్ణుడి మనసు నుంచి పుట్టిందని స్థలపురాణం చెబుతోంది. ఒకసారి యశోద - నందుడు కలిసి కృష్ణుడిని వెంటబెట్టుకుని గంగా స్నానానికి వెళ్లాలని అనుకుంటారు. వాళ్లతో వెళ్లడానికి సిద్ధపడిన కృష్ణుడు ... గోపాలకులను కూడా తమతో వచ్చేయమని అంటాడు.

అంతదూరం తాము రాలేమనీ ... అలా అని కృష్ణుడు వెళ్లి వచ్చేంత వరకూ ఆయన ఎడబాటును భరించలేమని వాళ్లు బాధపడుతుంటారు. దాంతో కృష్ణుడు వాళ్లను వదిలివెళ్లలేకపోతాడు. అలాగే తాను తోడు లేకుండా తల్లిదండ్రులను పంపించలేకపోతాడు. అందుకే గంగనే అక్కడికి తీసుకురావాలని సంకల్పించుకుంటాడు.

అలా ధ్యాన నిమగ్నుడైన ఆయన మనసునుంచి 'గంగ' పుడుతుంది. ఈ కారణంగానే ఇది 'మానసగంగ' పేరుతో పిలవబడుతోంది. సాక్షాత్తు కృష్ణుడి మనసు నుంచి ఉద్భవించిన గంగ కావడం వలన ఇందులో స్నానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయనీ ... విశేష పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News