నృత్యగణపతి ఆరాధనా ఫలితం !
సాధారణంగా వినాయకుడిని ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. ఎవరు ఎలా పూజించినా పెద్దమనసుతో వాటిని స్వీకరించడం ... అనుగ్రహించడం ఆయన సహజ లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. అందువలన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అంతా ఆయన పూజల్లో పాల్గొంటూ ఉంటారు. భక్తితో వాళ్లు చేసే సందడి అంటే ఆయనకి మహాఇష్టం.
అలాంటి వినాయకుడు ధర్మబద్ధంగా ఎవరు ఎలాంటి కోరిక కోరినా అనుగ్రహిస్తుంటాడు. ఈ నేపథ్యంలో విశిష్ట వినాయకులుగా చెప్పబడుతోన్నవారిలో 'నృత్యగణపతి' కూడా కనిపిస్తూ ఉంటాడు. అడిగిన వరాలను అతిత్వరగా అందించడంలో ఈయన మరింత ముందుంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా పురాణ సంబంధమైన కథనాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి.
ఒకసారి గణపతి ఆనందంతో నృత్యంచేస్తూ ఉండగా చంద్రుడు అక్కడికి వస్తాడు. ఆయనని చూసి తాను నవ్వడం ... ఫలితంగా శాపాన్ని పొందడాన్ని గుర్తుచేస్తాడు. జరిగినదానికి తను చాలా పశ్చాత్తాప పడుతున్నానని చెబుతాడు. చేసిన తప్పుని చంద్రుడు తెలుసుకోవడం పట్ల మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వినాయకుడు నృత్యం చేశాడట. చవితి రోజున ఆయనని చూసినవాళ్లు నిందలపాలు కాకుండా ఉండాలంటే, జరిగిన కథను చదువుకుని అక్షింతలు తలపై ధరిస్తే సరిపోతుందని చెబుతాడు.
అంతే కాకుండా సంకటహర చతుర్థి రోజున తనతో కలిసి పూజలందుకునేలా చంద్రుడిని అనుగ్రహిస్తాడు. ఈ రోజున తనతో పాటు చంద్రుడిని పూజించడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని స్వయంగా చెబుతాడు. నృత్య గణపతిని వేడుకోవడం వల్లనే చంద్రుడికి వెంటనే అనుగ్రహం లభించిందని అంటారు. ఈ కారణంగానే నృత్య గణపతిని ఆరాధించడం వలన వెంటనే ఫలితం కనిపిస్తుందనీ, అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతుంటారు.