సీతారాములను కనిపెట్టుకునుండే సర్పం
సాధారణంగా మహర్షుల కాలంలో ఆవిర్భవించిన దైవమూర్తులు కొన్నికారణాల వలన మరుగునపడిపోతుంటాయి. ఆ తరువాత ఆ దైవం తన భక్తుల కలలో కనిపించి తన జాడను తెలపడం ... వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది.
అయితే ఆకాశం నుంచి దివ్యమైన తేజస్సుగా వచ్చి ఆవిర్భవించిన స్వామి, వెంటనే ఆ విషయాన్ని తన భక్తుడికి స్వప్నం ద్వారా తెలియపరచిన సంఘటన మనకి 'కవాడపల్లి' క్షేత్రంలో కనిపిస్తుంది. హైదరాబాద్ - హయత్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది.
ఇక్కడి గుట్టపైకి ఒక రాత్రివేళ దివ్యమైన తేజస్సు దిగుతూ ఉండటం కొంతమందికి కనిపిస్తుంది. అదే సమయంలో ఒక భక్తుడి కలలో రాముడు కనిపించి తాను ఇక్కడ వెలసినట్టుగా చెప్పడం జరుగుతుంది. రాత్రి ఆ తేజస్సు చూసినవాళ్లు అదేమిటో తెలుసుకోవడం కోసం ... కలలో రాముడు కనిపించిన వ్యక్తి అది నిజమో భ్రమో తెలుసుకోవడం కోసం మరునాడు ఉదయాన్నే గుట్టపైకి చేరుకుంటారు.
అక్కడ వారికి కొండరాళ్ల మధ్య వెలసిన సీతారాములు కనిపిస్తారు. ఆ రోజు నుంచి ఈ క్షేత్రం తన ప్రత్యేకతను చాటుకుంటూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇక్కడ సీతారాములకు ... లక్ష్మీనారాయణుల మాదిరిగా ఆదిశేషుడు తన పడగను గొడుగులా పట్టిన ముద్ర బండరాయిపై స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆదిశేషుడు ఈ క్షేత్రాన్ని కనిపెట్టుకుని ఉంటాడని అర్చకులు చెబుతుంటారు. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా ఈ పరిసరాల్లో ఒక సర్పం సంచరిస్తూ ఉండటమే ఇందుకు నిదర్శనమని అంటారు.