వ్యాధులను నివారించే హనుమంతుడు

అనారోగ్యంతో బాధలు పడుతున్నవాళ్లు ఎక్కువగా హనుమంతుడి ఆలయాలను దర్శిస్తూ వుంటారు. హనుమంతుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగి పోతాయని వాళ్లు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకు నిదర్శనంగానే కొన్ని క్షేత్రాలు దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో 'ఎంపల్లి' ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది.

నిజామాబాద్ జిల్లా 'చిన్నకోడప్ గల్' కి సమీపంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడి హనుమంతుడు మహిమాన్వితుడనీ, అంకితభావంతో ఆయనని వేడుకుటే వ్యాధులు నివారించబడతాయని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా చాలాకాలం క్రిందట జరిగిన ఒక సంఘటన గురించి చెబుతుంటారు.

అలా వెనక్కి వెళితే ... ఒకసారి ఈ గ్రామం అంటువ్యాధుల బారిన పడటం జరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటువ్యాధుల బారి నుంచి తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది. దాంతో ఇక బతకాలంటే ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోవడమే మార్గమని అనుకుంటారు. అలా చాలామంది ఆ గ్రామాన్ని విడిచి మరో ప్రాంతానికి వెళ్లిపోతారు.

మిగిలిని కొంతమంది ఆ ఊరుని వదిలి వెళ్లలేక .. అక్కడి చెట్టుకింద వెలసిన హనుమంతుడి దగ్గరే కూర్చుంటారు. అంటువ్యాధుల బారిన పడేవరకూ ఆయన భజన చేసుకుంటూ కూర్చుంటే పుణ్యమైనా వస్తుందని అలా చేయడం మొదలు పెడతారు. ఆశ్చర్యకరంగా అంటువ్యాధుల ప్రభావం తగ్గుతూపోతుంది.

తామంతా బతికి బయటపడటానికి కారణం హనుమంతుడి అనుగ్రహంగా వాళ్లు భావిస్తారు. ఆ స్వామి ఆలయ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. అప్పటి నుంచి ఇక్కడి స్వామిని 'సిద్ధి హనుమంతుడు' గా ... వ్యాధులను నివారించే స్వామిగా విశ్వసిస్తుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవిస్తూ తరిస్తుంటారు.


More Bhakti News