శని దుష్ప్రభావం ఇలా తగ్గుతుందట !

శని దోషం అనే మాట వినగానే ఎవరైనాసరే తీవ్రమైన ఆందోళనకి లోనవుతుంటారు. ఇక ఏవైపు నుంచి ఏ కష్టం ముంచుకువస్తుందోనని దిగాలు పడుతుంటారు. సాధ్యమైనంత తొందరగా శనిదేవుడు తమని వదిలిపెడితే బాగుండునని అనుకుంటారు. అందుకోసం ఎవరేం చెప్పినా చేసేస్తుంటారు. ఈ నేపథ్యంలో పూజలు ... అభిషేకాలు చేసేవాళ్లు కొందరైతే, శాంతులు ... జపాలు చేసేవాళ్లు మరికొందరు.

ఇవే కాకుండా శనిదేవుడిని శాంతింపజేయడానికి మరో మార్గం కూడా వుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పవిత్రతను పాటిస్తూ .. దైవాన్ని విశ్వసిస్తూ .. తల్లిదండ్రులని ప్రేమిస్తూ .. మూగజీవాలపట్ల సానుభూతిని ప్రకటిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించడమే ఆ మార్గంగా కనిపిస్తుంది. ఇలా ఒక మంచి నడవడికను అలవరచుకుని ఆ మార్గంలో ప్రయాణంచేస్తూ వుంటే, శని దుష్ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుందని చెప్పబడుతోంది.

మూగజీవాలకు కావలసిన ఆహారాన్ని ఏర్పాటుచేయడం ఇందులో భాగంగా కనిపిస్తుంది. ఈ విధంగా చేయడం వలన శనిదేవుడు సంతోషిస్తాడట. శని బారిన పడిన వాళ్లు, గుర్రాలకు శనగలు తినిపించడం వలన ఆయన సంతృప్తి చెందుతాడని చెప్పబడుతోంది. ఆయన ప్రసన్నుడైతే సహజంగానే ఆ దుష్ప్రభావం నుంచి బయటపడటం జరుగుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News