అయ్యప్పస్వామికి కల్యాణోత్సవం !
అయ్యప్పస్వామి బ్రహ్మచారి గదా ... ఆయనకి కల్యాణోత్సవం ఏంటని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కానీ ఒకేఒక్క క్షేత్రంలో మాత్రం ఆయనకి కల్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆ క్షేత్రమే 'ఆరియంగావు' ... ఇది తిరువనంతపురం సమీపంలో అలరారుతోంది. అయ్యప్పస్వామి మరో అవతారంలో ఉండగా 'పుష్కళ'తో వివాహం జరిగిందని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.
స్వామివారు పుష్కళను వివాహం చేసుకున్నతీరు ఎంతో ఆసక్తికరంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనంగా కనిపిస్తుంటుంది. ఒక వస్త్ర వ్యాపారి ఈ ప్రదేశం మీదుగా తరచూ 'ట్రావెన్ కోర్' వెళ్లి అక్కడ తన వస్త్రాలను అమ్మకం జరిపేవాడట. ఆయన కూతురే పుష్కళ ... యుక్త వయసులోకి అడుగుపెట్టిన ఆమె, ఒకసారి తండ్రితో కలిసి బయలుదేరుతుంది.
ఈ ఆలయం సమీపానికి రాగానే వాతావరణం అనుకూలించకపోవడంతో, ఆయన తన కూతురిని ఆలయం అర్చకుడి రక్షణలో వుంచి బయలుదేరుతాడు. అక్కడి నుంచి ఒంటరిగా అడవిలో కొంతదూరం ప్రయాణించిన ఆయన క్రూరమృగాల బారిన పడతాడు. ఇక తన ప్రాణాలు పోవడం ఖాయమని ఆయన అనుకుంటూ వుండగా ఒక యువకుడు వచ్చి ఆయన ప్రాణాలను కాపాడతాడు.
ఆ వ్యాపారి అతనికి కృతజ్ఞతలు చెప్పుకుని సంతోషంతో తన దగ్గరున్న పట్టు శాలువాను అతనికి కప్పుతాడు. ఆ తరువాత తన వ్యాపారం చూసుకుని తిరిగివస్తూ 'ఆరియంగావు' ఆలయ దగ్గర ఆగి ... తన కూతురు గురించి అక్కడి అర్చకుడిని అడుగుతాడు. అతని కూతురిని స్వామి అర్ధాంగిగా స్వీకరించాడనీ, ఆయనలో ఆమె ఐక్యమైపోయిందని ఆ అర్చకుడు చెబుతాడు. ఆ మాటలను నమ్మని వ్యాపారి ఆదుర్దాతో ఆలయంలోకి వెళతాడు.
తన ప్రాణాలను కాపాడిన యువకుడికి తాను కప్పిన శాలువ, స్వామివారి మూలామూర్తిపై ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు స్వామి పుష్కళ సమేతంగా ఆయనకి దర్శనమిచ్చి తరిపజేస్తాడు. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించడం జరుగుతోందట.