నిజమైన భక్తికి ఆమె నిలువెత్తు నిదర్శనం

సీతారాములను పూజించడం ... వాళ్లను కీర్తిస్తూ తనని తాను మరిచిపోవడం తప్ప త్యాగరాజుకి మరేమీ తెలియదు. పూజా మందిరమే ఆయన ప్రపంచం ... సీతారాములే ఆయన సర్వస్వం. సంపాదన గురించిన ఆశ గానీ ... ఇల్లు ఎలా గడుస్తుందనే బెంగ కాని ఆయనకి ఉండేవి కావు. భక్తికి మించిన సంపద ... భగవంతుడి అనుగ్రహానికి మించిన ఫలితం ముందు ఏదీ సాటిరాదని ఆయన విశ్వసిస్తూ ఉండేవాడు.

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ భర్తకైనా భార్య సహకారం ఉండవలసిందే. ఆ సహకారాన్ని పూర్తి స్థాయిలో త్యాగరాజుకి ఆయన అర్ధాంగి అందిస్తుంది. భర్త మనసు తెలుసుకుని ఆయన ఆరాధనకు కావలిసిన ఏర్పాట్లుచేస్తూ వుంటుంది. అసహనానికీ ... అసంతృప్తికి దూరంగా ఉంటూ, ఉన్నదాంట్లోనే సర్దుకుపోతూ కుటుంబాన్ని గడుపుతుంటుంది.

త్యాగరాజు పూజించే సీతారాముల విగ్రహాలను ఆయన సోదరుడు దొంగిలించి కావేరీ నదిలో పారేస్తాడు. ఆ విషయం తెలియని త్యాగరాజు ... దొంగలు దోచుకెళ్లారని బాధపడుతుంటే ఆమె ఎంతగానో ఓదారుస్తుంది. ఆ విగ్రహాలను వెతకడానికి త్యాగరాజు బయలుదేరుతూ, తాను తిరిగి వచ్చేంత వరకూ పసుపుతో చేసిన సీతారాములను పూజిస్తూ ఉండమని చెబుతాడు.

పూజా మందిరంలో ఆమె పసుపుతో చేసిన సీతారాములను వుంచుతుంది. సీతారాముల విగ్రహాలు లభించకపోతే తన భర్త పొందే దుఃఖాన్నితాను చూడలేనంటూ ఆవేదన చెందుతుంది. సీతారాముల విగ్రహాలతో తన భర్త తిరిగిరావాలని కోరుకుంటూ, అప్పటివరకూ ఉపవాస దీక్షను చేపడుతుంది. ఆ దంపతుల పుణ్యఫల విశేషం కారణంగా ఆ విగ్రహాలు లభిస్తాయి.

అయితే అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. తమ సీతారాములు తిరిగి వచ్చారని త్యాగరాజు చెబుతూ వుంటే, ఆమె ఆప్యాయంగా ఆ విగ్రహాలను తాకుతుంది. భగవంతుడితో అంతకాలం ఎడబాటుని భరించిన ఆమె కన్నీళ్ల పర్యంతమవుతుంది. చివరిగా సీతారాములను కళ్లారా చూసుకున్న ఆ మహా ఇల్లాలు భర్త సన్నిధిలో తన శరీరాన్ని వదిలిపెట్టి భగవంతుడిలో ఐక్యమైపోతుంది.


More Bhakti News