ఈ స్వామిని దర్శించుకుని వెళితే చాలు

పూర్వం మహర్షులచే ... మహారాజులచే పూజించబడిన దేవతా మూర్తులు ఆ తరువాత కాలంలో అంతర్హితమై పోయాయి. ఆ తరువాత తాను ప్రకటనమయ్యే సమయం ఆసన్నమైందని భావించిన భగవంతుడు, తన భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి తన జాడను తెలుపుతూ వెలుగులోకి రావడం జరుగుతూ వుంటుంది.

అలాంటి కథే మనకి 'కరవిరాల' క్షేత్రంలోను వినిపిస్తుంది. నల్గొండ జిల్లా 'నడిగూడెం' మండలం పరిధిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ప్రాచీనకాలం నాటి చెన్నకేశవస్వామి ఇక్కడ దర్శనమిస్తూ వుంటాడు. చాలాకాలం క్రిందట ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తుడికి స్వామివారు స్వప్నంలో కనిపించారట. తాను ఫలానా ప్రదేశంలో ఉన్నాననీ ... తనని వెలికితీసి పూజాది కార్యక్రమాలు జరిగేలా చూడమని చెబుతాడు.

ఆ వ్యక్తి ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేస్తాడు. అంతాకలిసి ఆ ప్రదేశానికి చేరుకొని అన్వేషించగా స్వామివారి మూర్తి లభిస్తుంది. దాంతో ఆలయాన్ని నిర్మించి ఆ ప్రతిమను అందులో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆనాటి నుంచి చెన్నకేశవస్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇక్కడి స్వామికి ఒక ప్రత్యేకత వుందని చెబుతారు. విద్య .. ఉద్యోగం ... వివాహం ... ఇలా ఏదో ఒక పని మీద బయలుదేరుతూ స్వామిని దర్శించుకుని ఆయనకి విషయం చెబుతుంటారు. ఆయన సాయం తప్పనిసరిగా కావాలని కోరుతుంటారు.

అలాంటప్పుడు స్వామి తమతో వస్తున్న అనుభూతి కలుగుతుందట. ఆయన స్వయంగా వెంట వచ్చి ఆ పని జరిగేలా చేస్తాడని చెప్పుకుంటూ వుంటారు. ఈ స్వామిని దర్శించుకుని వెళ్లిన వాళ్లు విజయంతో తిరిగి రావలసిందేనని విశ్వసిస్తుంటారు. పర్వదినాల సమయంలో స్వామి వైభవంతో వెలుగొందడానికి గాను తమవంతు సహకారాన్ని అందిస్తూ, తమ కృతజ్ఞతను చాటుకుంటూ వుంటారు. స్వామిని ఇలవేల్పుగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు ... పునీతులవుతుంటారు.


More Bhakti News