నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధనా ఫలితం

శరదృతువు ఆరంభం నుంచి ... అంటే, ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులపాటు జరిగే అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని 'శరన్నవరాత్రి ఉత్సవాలు' గా ... 'దేవీనవరాత్రులు'గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.

భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి ... ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తూ వుంటారు. ఆ తల్లి ఆశీస్సులను ... అనుగ్రహాన్ని కోరుతుంటారు. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవిగా ... మహా పవిత్రమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకరించబడిన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... సుఖశాంతులు ప్రసాదించబడతాయని చెప్పబడుతోంది.


More Bhakti News