సంతోషాల వాకిట బతుకమ్మ సంబరం

తెలంగాణా ప్రాంతంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో 'బతుకమ్మ' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. శరన్నవరాత్రుల కాలంలో జరుపుకునే ఈ పండుగను తెలంగాణా స్త్రీలు ప్రాణప్రదంగా భావిస్తారు. భాద్రపదమాసం చివరి రోజైన అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను సంతోషంగా ... సంబరంగా జరుపుకుంటూ వుంటారు.

బతుకమ్మ పండుగలో భాగం పంచుకోవడానికే అన్నట్టుగా ఈ కాలంలో వివిధ రకాల పూలు పూస్తుంటాయి. అలా ఈ బతుకమ్మలలో ఒదిగి పోవడంలో 'తంగేడు పూలు ... గునుగు పూలు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. ఇక వివిధ రకాల బంతి పూలు ... రైలు కట్ల పూలు కూడా ఈ వరుసలలో చేరిపోతుంటాయి.

గుమ్మడి ఆకులపై అడుగు భాగం నుంచి వెడల్పుగా పూల వరసలు పేరుస్తూ, పైకి వెళుతున్నాకొద్దీ వెడల్పును తగ్గిస్తూ వస్తారు. దాంతో అమ్మవారికి సంబంధించిన శ్రీచక్ర మేరును ఈ బతుకమ్మలు గుర్తుచేస్తుంటాయి. ఒక్కో వరుసకు ఒక్కో రకం పూలను వాడుతూ బతుకమ్మకు అందాన్నీ ... నిండుదనాన్ని తీసుకువస్తుంటారు.

బతుకమ్మను మధ్యలో వుంచి స్త్రీలంతా వలయాకారంలో చుట్టూ తిరుగుతూ ... చప్పట్లు కొడుతూ ... ఆడుతూ పాడుతూ పూజిస్తారు. ఉత్సాహంగా ... ఉల్లాసంగా ... సంతోషంగా ... సంబరంగా జరుపుకునే ఈ భక్తి భరితమైన పండుగలో పిన్నల నుంచి పెద్దల వరకూ పాల్గొంటూ వుంటారు.

చోళ రాజులలో ధర్మాంగదుడు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన భార్య పేరు సత్యవతి ... ఆమె కూడా భర్తకు తగిన మహా ఇల్లాలు. అయితే సంతానం నిలవకపోవడమనే బాధ ఆ దంపతులను వేధిస్తూ వుంటుంది. దాంతో వాళ్లు అమ్మవారిని ప్రార్ధించడంతో, ఆమె అనుగ్రహంతో ఓ కూతురు జన్మిస్తుంది. అలా జన్మించిన కూతురికి వాళ్లు పెట్టుకున్న పేరే 'బతుకమ్మ'.

అప్పటి వరకూ కలిగిన సంతానం చనిపోతూ ఉండటంతో, ఈ ఆడపిల్ల అయినా తమ ముద్దూ ముచ్చట తీర్చాలనే ఉద్దేశంతో ఈ పేరు పెడతారు. కాలక్రమంలో ఆమె కారణజన్మురాలనే విషయం వెలుగు చూస్తుంది. ఆమె పేరుతోనే తెలంగాణ ఆడపడచులు 'బతుకమ్మ' ఆడటం జరుగుతోందని పెద్దలు చెబుతుంటారు. అలా తరతరాలుగా తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన 'బతుకమ్మ', ఇప్పుడు మరింత ఘనంగా ... వైభవంగా సందడి చేస్తోంది.


More Bhakti News