ఇక్కడి దుర్గాదేవి ఆలయం విశిష్టత ఇదే !

ఎన్నో దుష్టశక్తులు ఈ లోకంలోని ప్రశాంతతను దెబ్బతీయడానికీ ... సాధు సత్పురుషుల జీవన విధానానికి భంగం కలిగించడానికి అనేకమార్లు ప్రయత్నించాయి. ఆ దుష్టశక్తుల ఆగడాలను భరించలేక ప్రజలు 'అమ్మా' అంటూ ఆర్తనాదం చేస్తూ వచ్చారు.

అలా వాళ్లు పిలిచిన ప్రతిసారి ఆ దుర్గమ్మ తల్లి ... తన బిడ్డలను కాపాడుకోవడం కోసం వివిధ రూపాలను ధరిస్తూ ... అసుర సంహారం చేస్తూ వచ్చింది. అనేక నామాలతో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటూ వుంది. అలా అమ్మవారు కొలువుదీరిన విశిష్టమైన ఆలయం ఒకటి మనకి 'అన్నవరం' లో దర్శనమిస్తుంది.

అన్నవరం అనగానే ఎవరికైనా 'సత్యనారాయణ స్వామి' ఆలయం కనులముందు కదలాడుతుంది. పరమపవిత్రమైన ఈ క్షేత్రంలోనే 'వనదుర్గ' ఆలయం కనిపిస్తుంది. సమస్త ప్రకృతినీ ... ఆ ప్రకృతిపై ఆధారపడిన జీవరాశిని రక్షించే తల్లిని 'వనదుర్గ'గా పిలుస్తుంటారు. ఈ అమ్మవారి ఆలయాన్ని పాండవులలో ఒకరైన 'అర్జునుడు' నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది.

కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తరువాత, తన కారణంగా యుద్ధంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం అర్జునుడిని కలచివేస్తుంది. దాంతో ఆయన ఆ పాపపరిహారానికిగాను ఏం చేయాలో తెలియక దిగాలుపడుతూ వుంటాడు. సత్యదేవుడిని పూజించి .. నూటాఎనిమిది పవిత్ర ప్రదేశాల్లో దుర్గాదేవి ఆలయాలను నిర్మించమని నారదమహర్షి సూచిస్తాడు.

దాంతో అర్జునుడు ఇక్కడి సత్యనారాయణస్వామిని దర్శించి పూజిస్తాడు. ఆ తరువాత ఇక్కడ వనదుర్గ ఆలయాన్ని నిర్మించినట్టు చెప్పబడుతోంది. ఈ అమ్మవారిని పూజించడం వలన పాపఫలితంగా అనుభవిస్తోన్న దుఃఖం దూరమవుతుందని అంటారు. ఇంతటి ప్రాచీనతను సంతరించుకున్న ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News