అలా హనుమంతుడి మనసు గెలిచాడు

లంకానగరంలో సీత జాడ తెలుసుకున్న హనుమంతుడు, రావణాసురిడితో మాట్లాడి వెళ్లాలని అనుకుంటాడు. రావణుడి ముందుకు తనని తీసుకువెళ్లడం కోసం అక్కడ నానాబీభత్సం సృష్టిస్తాడు. ఈ ప్రయత్నంలో ఆయనని అడ్డుకోవడానికి వచ్చిన అసురులంతా నేలకూలతారు. చివరికి ఇంద్రజిత్ సంధించిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తూ హనుమంతుడు బందీ అవుతాడు.

ఆ విధంగా రావణుడి ఎదురుగా ప్రవేశపెట్టబడతాడు. రావణుడి రూపు రేఖలు ... ఆయన అనుభవిస్తోన్న వైభవం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. తాను శ్రీరాముడి దూతగా వచ్చాననీ ... రావణుడి ప్రశ్నకి సమాధానంగా చెబుతాడు. రామలక్ష్మణుల పరాక్రమాన్నీ ... సుగ్రీవుడికి గల సైనిక బలగాన్ని గురించి వివరిస్తాడు. చేసిన తప్పు తెలుసుకుని సీతను అప్పగించకపోతే, లంకానగరానికి చెడ్డరోజులు దాపురించినట్టుగా భావించమని చెబుతాడు.

ఆ మాటలు విన్న రావణుడు ఆగ్రహావేశాలకి లోనవుతాడు. వెంటనే ఆ వానరుడిని అంతం చేయమని తన వాళ్లని ఆదేశిస్తాడు. అక్కడే వున్న విభీషణుడు తటాలున లేచి రాజభటులను వారిస్తాడు. దూతను చంపడం రాజధర్మం కాని సోదరుడితో చెబుతాడు. రాముడు ... సుగ్రీవుడు ఏదైతే చెప్పమన్నారో అదే దూత చెప్పాడనీ, అందుకు అతనిపై ఆగ్రహించి ప్రాణాలు తీయడం సబబుకాదని అంటాడు.

దూతని అంతమొందించడం వలన ... అతన్ని పంపించిన వాళ్లకి తమ శక్తిసామర్థ్యాలు తెలియకుండా పోతాయని చెబుతాడు. అందువలన ఆ వానరుడు సృష్టించిన విధ్వంసానికి ఏదైనా శిక్ష విధించి ప్రాణాలతో వదిలిపెట్టడమే ధర్మమని హితవు చెబుతాడు. ఆ మాటలు రావణుడిపై ప్రభావం చూపడంతో ఆయన అందుకు అంగీకరిస్తాడు. సోదరులే అయినా రావణుడికీ ... విభీషణుడికి గల వ్యత్యాసాన్ని హనుమంతుడు గమనిస్తాడు. విభీషణుడి మాట తీరును ... ధర్మనిరతిని మనసులో అభినందించకుండా ఉండలేకపోతాడు.


More Bhakti News