శుభాలను చేకూర్చే శంకరుడి దర్శనం

ఆదిదేవుడిని అనునిత్యం సేవించేవాళ్లు ఎప్పుడూ ఆనందంగానే వుంటారు. ఆ సదాశివుడిని ఆరాధించేవాళ్లు సమస్యలకు దూరంగా సంతోషాలకు దగ్గరగా వుంటారు. అడిగిన వెంటనే వరాలను అందించే దైవంగా ఆయన అందరి మనసులలోను కొలువై కనిపిస్తుంటాడు. మానసిక పరిపక్వతను బట్టి భక్తులు అడుగుతున్నవి అనుగ్రహిస్తూ వస్తుంటాడు.

ఈ కారణంగానే ఆయన కొలువైన క్షేత్రాలు ఎప్పుడు చూసినా భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. ఇక ఆయన స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు ... ప్రాచీనతను సంతరించుకున్న క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా అలరారుతున్నాయి. అలాంటి శివాలయాలలో ఒకటి 'గోండ్రియాల'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా కోదాడ మండలంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

కాకతీయుల కాలంలోనూ ... అంతకంటే ముందుకాలంలోనూ శివాలయాల నిర్మాణం విరివిగా జరిగింది. తమకంటే పూర్వం గల శివాలయాల అభివృద్ధికి కాకతీయులు ఎంతగానో కృషి చేశారు. అలాగే తమ పరిపాలనా కాలంలో ఎన్నో శివాలయాలను నిర్మించారు. అలా కాకతీయుల కాలంలో ఒక వెలుగు వెలిగిన దేవాలయంగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది.

ఊళ్లో వాళ్లంతా కూడా ఇక్కడి స్వామిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ వుంటారు. ఆయన అనుగ్రహం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనీ ... సంపదలు చేకూరతాయని చెబుతుంటారు. సకల శుభాల నొసగే ఆ స్వామికి పర్వదినాల సమయంలో ప్రత్యేక పూజలు ... విశేష సేవలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అంతా సర్వేశ్వరుడిని దర్శిస్తుంటారు. ఆయన కరుణా కటాక్ష వీక్షణాలను పొందుతుంటారు.


More Bhakti News