ఇక్కడ బంగారు నేత్రాలను సమర్పిస్తారు
ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత వుంటుంది ... ఆ విశిష్టతను బట్టే అక్కడ మొక్కుబడులు చెల్లించడం జరుగుతుంటుంది. ప్రతి ప్రాంతంలోను ఏదో ఒక ప్రసిద్ధ క్షేత్రం ఉండనే ఉంటుంది. అక్కడి దైవంపట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం వుంటుంది. అందువలన తమలో ఎవరికి ఆపద కలిగినా ... ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా ఆ కష్టం నుంచి గట్టెక్కించమని ఆ దైవాన్నే ప్రార్ధించడం జరుగుతూ వుంటుంది.
ఆ గండం నుంచి బయటపడగానే తరతరాలుగా అక్కడ కొనసాగుతున్న పద్ధతిని అనుసరిస్తూ మొక్కుబడులు చెల్లిస్తుంటారు. ఇక తమ జీవితంలో అత్యంత ముఖ్యమైనదనుకున్న కోరిక నెరవేరడం వలన కూడా మరికొందరు మొక్కుబడులు చెల్లిస్తుంటారు. అలా 'నైనతాల్' లో ఆవిర్భవించిన అమ్మవారికి భక్తులు వెండి ... బంగారు నేత్రాలను సమర్పిస్తూ కనిపిస్తారు.
సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలలో శక్తిపీఠాలు అవతరించాయనే సంగతి తెలిసిందే. అలా అమ్మవారి 'వామనేత్రం' ఈ ప్రదేశంలో పడి సరస్సుగా మారిపోయిందట. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. అమ్మవారి నేత్రం పడిన మహిమాన్వితమైన ప్రదేశం కనుక, తమ కోరికలను నెరవేర్చే ఆ తల్లికి భక్తులు వెండితోను ... బంగారంతోను చేసిన నేత్రాలను సమర్పిస్తుంటారు.
మరికొందరు ఆ తల్లి చల్లని చూపులు తమపై ఎల్లప్పుడూ వుండాలని భావిస్తూ ఇలా వెండి .. బంగారు నేత్రాలను సమర్పిస్తుంటారు. అమ్మవారి ఆశీస్సులు అందుకుని సంతోషంతో ... సంతృప్తితో వెనుదిరుగుతుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతూ ... అడుగడుగునా అమ్మవారి మహిమలను ఆవిష్కరించే ఈ పుణ్యస్థలిని ప్రతి ఒక్కరూ చూసితీరవలసిందే. భక్తిభావ పరిమళాలను ఆస్వాదిస్తూ తరించవలసిందే.