హనుమంతుడు ఇలా ప్రసన్నుడవుతాడట !
హనుమంతుడి అనుగ్రహం వలన పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. ఆయన అనుగ్రహం వలన అపజయాలు దూరమవుతాయి. దుష్టశక్తుల వలన కలిగే భయం ... గ్రహ సంబంధమైన దోషాల వలన కలిగే ఇబ్బందులు ... పాపాల ఫలితంగా పడుతోన్న బాధలు తొలగిపోతాయి. ఆయన అనుగ్రహం వుంటే ఆటంకాలు తొలగి అన్నీ శుభాలే జరుగుతాయి.
అలాంటి హనుమంతుడి అనుగ్రహాన్ని పొందడానికిగాను ఎవరికి తెలిసిన మార్గాన్ని వాళ్లు అనుసరిస్తూ వుంటారు. లోకంలో ఎవరైనా తమకి నచ్చిన విధంగా నడచుకునే వాళ్లను అభిమానిస్తుంటారు. తన ఇష్టమేమిటో తెలుసుకుని వ్యవహరించే వారిని ప్రేమిస్తుంటారు ... అలాగే హనుమంతుడు కూడా. హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైనది ఏదంటే ... రామనామ సంకీర్తనే. నిరంతరం రామనామ సంకీర్తన ఎక్కడైతే జరుగుతూ వుంటుందో, హనుమంతుడు అక్కడికి తప్పనిసరిగా వస్తాడు.
అందువలన హనుమంతుడి అనుగ్రహాన్ని ఆశించేవాళ్లు రామనామ సంకీర్తన చేస్తుండాలి. అంతే కాదు ఆయనకి ఎంతో ఇష్టమైన సుందరకాండ - రామాయాణం పారాయణం చేస్తూ వుండాలి. ఇక భక్తి శ్రద్ధలతో ఆయనను తమలపాకులతో పూజించి 'వెన్న'ను నైవేద్యంగా సమర్పిస్తూ వుండాలి. ఈ విధంగా చేయడం వలన హనుమంతుడు ప్రసన్నుడవుతాడు ... కోరిన వరాలను ప్రసాదిస్తాడని చెప్పబడుతోంది.