పుణ్యఫలాలను ప్రసాదించే రాధాకుండం
బృందావనం చేరుకున్నవారికి ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ... పరమాత్ముడి సన్నిధిలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ రాధామాధవులకు సంబంధించని ప్రదేశమంటూ కనిపించదు. అంతగా వాళ్లు ఈ ప్రాంతాన్ని తమ ఆటపాటలతో ప్రభావితం చేశారు.
అందువలన ఇక్కడి చెట్టూ చేమ ... రాయి రప్పా అన్నీ కూడా రాధాకృష్ణుల ప్రేమానురాగాలకు ప్రత్యక్ష సాక్షులుగా కనిపిస్తుంటాయి. ఆ ప్రదేశాల్లోకి అడుగుపెట్టిన వాళ్లని ఆ కాలానికి తీసుకు వెళుతూ వుంటాయి. అలా రాధాకృష్ణులకి సంబంధించిన ఆనవాళ్లుగా 'రాధాకుండం' ... 'శ్యామ కుండం' కనిపిస్తూ వుంటాయి.
ఈ కుండాలు ఇక్కడ ఏర్పడటానికి గల కారణంగా ఒక పురాణపరమైన కథనం ఆసక్తికరంగా వినిపిస్తూ వుంటుంది. లోకకల్యాణం కోసం కృష్ణుడు ... 'అరిష్టాసురుడు'ని సంహరిస్తాడు. ఆ పాపానికి పరిహారంగా ఆయన సమస్త పుణ్య తీర్థాలలో స్నానం చేయవలసి ఉంటుందని రాధతో పాటు గోపికలంతా ఆయనతో అంటారు.
తాను ఎక్కడికీ వెళ్లవలసిన అవసరంలేదనీ, సమస్త పుణ్యతీర్థాలు తన దగ్గరికే వస్తాయని అంటాడు కృష్ణుడు. ఆయనలా అంటూ తన కాలుతో అక్కడి నేలను తట్టగానే సమస్త పుణ్యతీర్థాలు కలిసిన కుండం అక్కడ ఏర్పడిందట. అందులో కృష్ణుడు స్నానం చేసి తాను చేసిన పాపం నశించిందని చెబుతాడు. ఈ కారణంగానే ఇది 'శ్యామకుండం' పేరుతో పిలవబడుతూ వుంటుంది.
ఇక కృష్ణుడిపై అలిగిన రాధ ... తన స్నేహితురాళ్లతో కలిసి ఆ పక్కనే మరోకుండాన్ని తవ్వుతుంది. ఆమె అలక తీర్చడం కోసం కృష్ణుడు, ఆ తీర్థ జలాలను ఆమె కుండంలోకి ప్రవహించేలా చేశాడట. ఈ కారణంగానే 'రాధాకుండం' మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. ఈ కుండంలో స్నానం చేయడం వలన సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని చెబుతుంటారు.