మహిమ చూపిన విశ్వనాథుడు

అది ఓ సాధారణమైన గ్రామం ... దానిపేరు 'కొండపాక'. మెదక్ జిల్లాలోని ఈ గ్రామం పాడిపంటలతో కళకళలాడుతూ వుండేది. అందువలన అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవనాన్ని కొనసాగించేవాళ్లు. అలాంటి ఆ గ్రామం ఒకసారి కరవు బారినపడింది. వ్యవసాయానికి ఎలాగో నీళ్లు లేకుండా పోయాయి ... ఇక తాగు నీరు దొరకడం కూడా కష్టమైపోసాగింది.

తమ పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ... పశువుల బాధలను చూడలేక వాళ్లు నానా ఇబ్బందులు పడసాగారు. అలాంటి పరిస్థితుల్లోనే వాళ్లకి ఆ ఊరి శివుడు గుర్తుకు వస్తాడు. తమకి కష్టం వచ్చినా ... నష్టం వచ్చినా అప్పటివరకూ ఆదుకుంటూ వచ్చింది ఆ రుద్రేశ్వరుడే. ఇక ఈ గండం నుంచి గట్టెక్కించే బాధ్యత కూడా ఆయనదేనని అనుకుంటారు.

కాకతీయుల కాలం నుంచి అక్కడ కొలువై వున్న ఆ స్వామిపైనే వాళ్లు ఆశలు పెట్టుకుంటారు. ఎంతో కష్టపడితేగానీ లభించని నీటితోనే ఆ స్వామిని అభిషేకించి, తమ ఆవేదనని ఆయనకి చెప్పుకోవాలని నిర్ణయించుకుంటారు. అలాగే ఆ చుట్టుపక్కల నుంచి వెయ్యి బిందెల నీటిని సంపాదించి ఆలయానికి చేరుకుంటారు. కనికరించి కరవుబారి నుంచి కాపాడమంటూ ఆదిదేవుడిని అభ్యర్థిస్తూ ఆ స్వామికి అభిషేకం చేస్తారు.

అంతే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఆ గ్రామంలో కుండపోతగా వర్షం కురిసిందట. కరవు కనిపించకుండా పోయేలా స్వామి అనుగ్రహించాడట. దాంతో స్వామివారి మహాత్మ్యం మరోసారి అక్కడి ప్రజలకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి వాళ్లు ఇక్కడి స్వామిని మరింత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. కోరికలు నెరవేర్చే కొంగుబంగారమంటూ ఆరాధిస్తూ వుంటారు. మహిమగల ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనోభీష్టాలు ఫలిస్తాయని చెబుతుంటారు.


More Bhakti News