భగవంతుడు వుండగా భయమెందుకు ?

శ్రీహరిని ద్వేషిస్తూ ... ఆయనపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం హిరణ్య కశిపుడు ఎదురుచూస్తుంటాడు. హరి నామాన్ని స్మరించవద్దని రాజ్యంలోని వాళ్లందరినీ కట్టడి చేయగలుగుతాడుగానీ, తన ఇంట్లోనే హరినామాన్ని వినవలసి రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు.

శ్రీహరి తనకి శత్రువనీ ... ఆయన నామాన్ని స్మరించడం మానుకోమని ప్రహ్లాదుడికి ఎన్నో విధాలుగా నచ్చచెబుతాడు. సున్నితంగా మందలిస్తాడు ... బెదిరిస్తాడు ... భయపెడతాడు. అయినా ప్రహ్లాదుడు వినిపించుకోకపోవడంతో కఠిన శిక్షలను అమలుజరుపుతాడు. ప్రహ్లాదుడిని ఎలా శిక్షించినా ఏదో శక్తి ఆయనని రక్షిస్తూ వుందని రాజభటులు చెబుతుంటారు.

ప్రహ్లాదుడి పట్ల ప్రేమతో వాళ్లు శిక్షలను అమలుజరపలేక అసత్యం చెబుతున్నారని హిరణ్యకశిపుడు అనుకుంటాడు. నిజానిజాలు తెలుసుకోవడం కోసం ప్రత్యక్షంగా తానే ప్రహ్లాదుడిని శిక్షించడానికి సిద్ధపడతాడు. కాలకూట విషాన్ని సిద్ధంచేసి ... ప్రహ్లాదుడికి కబురు చేస్తాడు. హరి నామస్మరణ మానకపోతే ఆ కాలకూట విషాన్ని తాగమని చెబుతాడు. శ్రీహరిని ధ్యానించకుండా తాను ఉండలేనంటూ ఆ స్వామిని తలచుకుని ఔషధంలా ఆ విషాన్ని ప్రహ్లాదుడు తాగేస్తాడు.

ఎంతమాత్రం భయపడకుండా ప్రహ్లాదుడు విషం తాగడం పట్ల హిరణ్యకశిపుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. భగవంతుడిని విశ్వసించేవారికి భయం ఉండదని చెబుతాడు ప్రహ్లాదుడు. తన భక్తులను ఎలా కాపాడుకోవాలో ఆ నారాయణుడికి తెలుసని అంటాడు. ఆ మాటలను నిజం చేస్తూ ప్రహ్లాదుడిని ఆ విషం ఏమీ చేయలేకపోతుంది. దాంతో అప్పటి వరకూ తనకి రాజభటులు చెబుతూ వచ్చిన మాటలు నిజమేననీ హిరణ్యకశిపుడు నమ్ముతాడు. ప్రహ్లాదుడిని రక్షించే ఆ శక్తి ... ఆ శ్రీమన్నారాయణుడేనని నిర్ధారణ చేసుకుంటాడు.


More Bhakti News