మనసు దోచుకునే మహాదేవుడు
శుభాలను ప్రసాదించువాడే శంకరుడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయన నామాన్ని స్మరిస్తే చాలు పాపాలు నశించిపోతాయి. ఆయనని దర్శిస్తే చాలు కష్టాలు కనుమరుగైపోతాయి. అలాంటిది ఆయన ఆలయాలను నిర్మిస్తే ... అందులో ఆయనని ప్రతిష్ఠిస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మలపాటు వెంటవస్తుంది. ఆ వంశం తరతరాలపాటు తరిస్తుంది.
ఈ కారణంగానే ప్రాచీనకాలంలో ఎంతోమంది రాజులు శివాలయాల నిర్మాణానికి పూనుకున్నారు. శివాలయాల అభివృద్ధికీ ... నిర్మాణానికి తమవంతు కృషిచేశారు. ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతోన్న కొన్ని ఆలయాలు, ఆనాటివారి భక్తిశ్రద్ధలకు ఆనవాళ్ళే. అలాంటి ప్రాచీన శివాలయాలకు చోటిచ్చి తరిస్తోన్న గ్రామాలలో ఒకటిగా 'నడిగూడెం' కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది.
నడిగూడెంలోనే కాదు ... ఈ మండలం పరిధిలో ప్రాచీనమైన దేవాలయాలు కనిపిస్తాయి. సిరిపురంలోని రంగనాయకస్వామి ఆలయం ... వేణుగోపాలపురంలోని కోదండరామాలయం ... కరవిరాలలోని చెన్నకేశవస్వామి ఆలయం .. ఇలా ఎన్నో విశిష్టమైన క్షేత్రాలు ఈ మండలం పరిధిలో విలసిల్లుతూ వుంటాయి.
ఇక ఈ మండల కేంద్రంలో 'సారంగేశ్వరస్వామి' ఆలయం కూడా ప్రాచీనమైనదే. కాకతీయుల కాలంలో వైభవాన్ని చూసిన ఇక్కడి శివుడు మహాతేజస్సుతో వెలిగిపోతుంటాడు ... మనసు దోచుకుంటూ వుంటాడు. ఈ స్వామిని దర్శించడం వలన .. తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయని చెబుతుంటారు. గుప్తనిధుల తవ్వకానికి గురైనా ... అలనాటి ఘనతకు ఈ ఆలయం అద్దంపడుతూనే వుంటుంది. ఆనందానుభూతులను అందిస్తూనే వుంటుంది.