దోషాలను తొలగించే భగవంతుడి సేవ

దేవాలయాలు ప్రశాంతతకు ... పవిత్రతకు ప్రతీకలుగా కనిపిస్తూ వుంటాయి. అందువలన మనశ్శాంతి కోసం భక్తులు ఆలయాలకు వస్తుంటారు. ఇక పర్వదినాల సమయంలో దైవానికి ఇష్టమైన పూలు .. పండ్లు తీసుకుని కుటుంబ సమేతంగా వచ్చి వెళుతుంటారు. ఈ కారణంగా ఆలయాలు రద్దీగా కనిపిస్తూ వుంటాయి. ఈ రద్దీలో కొంతమంది కొబ్బరికాయ కొట్టి దాని వెనుక పీచు తీసి అక్కడే వేస్తుంటారు. ప్రసాదం తిని ఆ కాగితాలను ... ఆకులను అక్కడే వదలి వెళుతుంటారు.

ఇలా ఇబ్బందికరమైన పరిస్థితి వున్నప్పుడు కొంతమంది వెంటనే తమ స్థాయిని పక్కనపెట్టి ఆలయాన్ని శుభ్రం చేస్తుంటారు. ఎవరేమనుకుంటారోననే భావన వీళ్లలో కనిపించదు. భగవంతుడి సేవచేసే అవకాశం లభించడమే అదృష్టమనే ఆలోచనే వారిలో కనిపిస్తుంది. నిజానికి భగవంతుడిని దర్శించుకోవడం వలన ఎంత పుణ్యం వస్తుందో, ఆయన ఆలయాన్ని శుభ్రం చేయడం వలన అంతకన్నా ఎక్కువ పుణ్య వస్తుంది.

అందువల్లనే ఒక నియమంగా పెట్టుకుని ఉదయాన్నే తమ గ్రామంలోని ఆలయానికి ... లేదంటే కాలనీలోని ఆలయానికి వెళ్లి శుభ్రంగా ఊడ్చి ... తుడిచి ... ముగ్గుపెట్టి వచ్చేవాళ్లు కూడా మనకి కనిపిస్తుంటారు. వీళ్లు భగవంతుడి అనుగ్రహాన్ని తప్ప ఎవరి నుంచి ఏమీ ఆశించరు. ఆలయాన్ని శుభ్రంగా తుడవడమంటే అది భగవంతుడి సేవగానే భావిస్తుంటారు ... ఆయన అనుగ్రహం తమకి లభిస్తుందని విశ్వసిస్తుంటారు.

అహాన్ని పక్కకి పెట్టి చేసే ఈ విధమైన సేవ వలన పాపాలు ... దోషాలు దూరమై, సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ... శని గ్రహ సంబంధమైన దోషాలతో బాధలు పడుతున్నవాళ్లు, హనుమంతుడి ఆలయాన్ని శుభ్రం చేయడంవలన మంచి ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.


More Bhakti News