అడిగినవరాలనిచ్చే కాళికాదేవి

ఆధ్యాత్మిక పరమైన కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు, ఆ సంఘటనలకు వేదికగా నిలిచిన ఆయా క్షేత్రాలను చూడాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తూ వుంటుంది. అలాంటి ఆసక్తిని కలిగించేదిగా 'కాళిదాసు' జీవితంలోని ఓ సంఘటన కనిపిస్తూ వుంటుంది. కాళిదాసు జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పిన ఆ సంఘటన అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది.

'కాలుడు' అనే ఓ గొర్రెల కాపరి అనుకోని పరిస్థితుల్లో మహారాజుకి అల్లుడు అవుతాడు. అమాయకుడైన కాలుడు తన అదృష్టానికి ఎంతగానో మురిసిపోతాడు. అయితే తాను మహాపండితుడని భావించి మహారాజు కూతురు తనని వివాహం చేసుకుందనే విషయం కాలుడికి తెలుస్తుంది.

తాను పండితుడిని కాదని తెలిసి భార్య కన్నీళ్ల పర్యంతం కావడాన్ని చూడలేకపోతాడు. తనకి తెలియకుండానే ఓ ఆడపిల్ల మనసుని కష్టపెట్టానని తెలిసి ఎంతగానో బాధపడతాడు. అమాయకంగా కాళికాదేవి ముందు కూర్చుని తనకి జ్ఞాన భిక్ష పెట్టమనీ, తన భార్య మనసు కుదుటపడేలా చేయమని కోరతాడు. తన మనసులోని కోరికను నెరవేర్చే వరకూ అక్కడి నుంచి కదిలేదిలేదంటూ కూర్చుంటాడు.

ఆయన నిస్వార్థ భక్తి ... అమాయకత్వంతో కూడిన అభ్యర్థన ... అమ్మా అని పిలుస్తూ అలక వహించడం కాళికాదేవి మనసును కరిగిస్తుంది. దాంతో ఆమె ప్రత్యక్షమై ... కాలుడి నాలుకపై బీజాక్షరాలు రాస్తుంది. దాంతో కాలుడు మహా పండితుడై ... మహాకవి కాళిదాసుగా కీర్తిప్రతిష్ఠలను సంపాదిస్తాడు. ఈ సంఘటన గురించి విన్నప్పుడు ఆ ప్రదేశాన్ని చూడాలనీ, అక్కడి కాళికాదేవిని దర్శించాలనిపిస్తుంది.

ఆసక్తికరమైన ఈ సంఘటనకు వేదికగా 'ఉజ్జయిని' కనిపిస్తుంది. ఇక్కడి మహాకాళేశ్వరుడికి దగ్గరలోనే ఆ కాళికాదేవి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. 'గ్రహకాళిక' పేరుతో పూజలు అందుకుంటోన్న ఇక్కడి అమ్మవారు ... అడిగిన వరాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఉజ్జయిని వెళ్లిన భక్తులు తప్పని సరిగా ఈ కాళికాదేవిని దర్శించుకుని వస్తుంటారు.


More Bhakti News