భగవంతుడి అనుగ్రహమే శాశ్వతం

భగవంతుడి అనుగ్రహమే శాశ్వతం ... మిగతావన్నీ తాత్కాలికమైన సుఖాలను మాత్రమే ఇస్తాయని తుకారామ్ బలంగా విశ్వసించేవాడు. ఈ కారణంగానే ఆయన తనకి కలిగిన దాంట్లో దానధర్మాలు చేస్తూ వస్తాడు. ఫలితంగా ఆయన సొంతమని చెప్పుకోవడానికి ఒక్క ఇల్లు మాత్రమే మిగులుతుంది. తుకారామ్ ఏ విషయాన్ని గురించి వాదించడు. ఏది జరిగినా అది భగవంతుడి ఆదేశంగానే భావిస్తాడు.

ఆయనంటే గిట్టని దొంగభక్తులు ఆ విషయాన్ని అవకాశంగా తీసుకుంటారు. పథకం ప్రకారం ఓ నాటకమాడి ఓ వ్యక్తికి జరిగిన నష్టానికి తుకారామ్ ని బాధ్యుడిని చేస్తారు. నష్టపరిహారమంటూ తుకారామ్ ఇంటిని ఆ వ్యక్తికి ఇప్పిస్తారు. అయినా తుకారామ్ బాధపడడు ... పాండురంగడి ఆదేశంగా భావించి ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. తన మంచికోరే వారు చూపిన మరో ప్రదేశంలో చిన్నపాక వేసుకుంటాడు.

అయితే తుకారామ్ నుంచి ఇంటిని తీసుకున్న వ్యక్తి దాంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతాడు. ఎన్నో అనుభవాలు ఆయనకి ఎదురవుతూ వుంటాయి. దాంతో ఆయన తుకారామ్ ని కలుసుకుని తన తప్పుని మన్నించమని వేడుకుంటాడు. ఆ ఇంటిని తిరిగి స్వీకరించమని కోరతాడు. నాది అనే వ్యామోహం భగవంతుడికి దగ్గర కాకుండా అడ్డుపడుతుందనీ, ఆయన సన్నిధికి దూరం చేసేది ఏదైనా అది తనకి అవసరం లేదని చెబుతాడు తుకారామ్.

సమస్త జీవరాసులు నివసించడానికి భగవంతుడు విశ్వమనే ఇంటిని ఏర్పాటు చేశాడనీ, అందులో లభించిన కొద్దిపాటి చోటులో ... ఆయన నుంచి పిలుపు వచ్చేవరకూ సర్దుకోగలనని తుకారామ్ అంటాడు. తనదంటూ ఏదీ లేదనీ ... ఒకవేళ వున్నా అది శాశ్వతం కాదని అంటాడు. భగవంతుడి అనుగ్రహమే శాశ్వతమైనదనీ ... ఆయన నీడయే తన నివాసమని చెబుతాడు. దాంతో ఆ వ్యక్తి ఆయన పాదాలకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.


More Bhakti News