ఆంజనేయుడికి ఆగ్రహం కలిగిందట !
హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి సహన శీలి. ఎలాంటి పరిస్థితుల్లోను తొందరపడకుండా సమయానికి తగిన విధంగా నడచుకోవడం ఆయన సహజ లక్షణం. సాధారణంగా ఆయనకి ఆగ్రహం రాదు ... వచ్చిందంటే ఒక పట్టాన దానిని నిగ్రహించడం కష్టం. అలాంటి హనుమంతుడికి కొంతమంది ప్రవర్తన ఆగ్రహాన్ని కలిగించిందనే విషయం ఒక క్షేత్రంలో వినిపిస్తూ వుంటుంది.
ఆ క్షేత్రం పేరు 'మేడూరు' ... ఇది కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలో అలరారుతోంది. స్వయంభువుగా ఇక్కడ ఆవిర్భవించిన వీరాంజనేయుడు మహిమాన్వితుడని చెబుతుంటారు. పూర్వం ఇక్కడి నిర్జన ప్రదేశంలో స్వామివారు ఆవిర్భవించడం జరిగింది. అప్పటి నుంచి స్వామి అంతకంతకూ పెరుగుతూ వుండటం సమీప గ్రామస్తులు గమనించారు.
అప్పటికే ఆయన చాలా ఎత్తు పెరగడంతో, మేకు కొట్టడం వలన ఎదుగుదలను ఆపవచ్చని ఎవరో సలహా ఇచ్చారట. అలా మేకు కొట్టి అప్పుడు ఆ స్వామి మూర్తిని తమ గ్రామంలో ప్రతిష్ఠించాలని సమీప గ్రామస్తులు ఆలోచన చేశారు. అలాగే హనుమంతుడి ప్రతిమ తల భాగంలో మేకు కొట్టి అక్కడి నుంచి ఆయనని కదిలించే ప్రయత్నం చేయబోయారట.
తనని బాధ పెట్టడమే కాకుండా ... తనకి ఇష్టమైన ప్రదేశం నుంచి కదిలించడానికి ప్రయత్నం చేసినందుకు ఫలితం అనుభవించక తప్పదనే మాటలు స్వామి మూర్తి నుంచి వినిపించాయట. ఆ క్షణమే ఆ వ్యక్తులకు సంబంధించిన గ్రామం అగ్ని ప్రమాదానికి గురైందట. చేసిన తప్పును క్షమించమంటూ వాళ్లంతా ఆయనని వేడుకుంటారు.
కాలక్రమంలో స్వామివారు ఆవిర్భవించిన ప్రదేశం మేడూరుగా అభివృద్ధి చెందింది. ఈ గ్రామస్తులు స్వామివారిని భక్తులు దర్శించుకునెందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామిని విశ్వసించినవారిని వెన్నంటి కాపాడతాడని భక్తులు చెబుతుంటారు. అందుకు ఉదాహరణగా అనేక సంఘటనలను గురించి వివరిస్తుంటారు.