ఈ హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తే చాలు

అనేక దోషాలకు హనుమంతుడి దర్శనమే విరుగుడు అనే విషయం ఆధ్యాత్మిక గ్రంధాలు చాటిచెబుతున్నాయి. కొన్ని విశిష్టమైన హనుమంతుడి క్షేత్రాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి ప్రాచీన హనుమంతుడి క్షేత్రాల జాబితాలో కృష్ణా జిల్లా 'తిరువూరు'ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి స్వామి దాసాంజనేయుడుగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.

కాకతీయుల కాలంలో అనేక ప్రదేశాల్లో శివాలయాల నిర్మాణం జరిగింది. కొన్ని శివాలయాల ప్రాంగణంలో వాళ్లు వేణుగోపాలస్వామిని ప్రతిష్ఠించారు. మరికొన్ని ప్రదేశాల్లో శివాలయంతో పాటుగా శివాంశ సంభూతుడైన హనుమంతుడి ఆలయాలను నిర్మించారు. అలా కాకతీయ 'గణపతిదేవుడు' ఇక్కడ శివాలయం ... హనుమంతుడి ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.

అయితే కాలక్రమంలో ఇక్కడి శివలింగం ఏమైందన్నది ఎవరికీ తెలియదు. దాంతో ఇక్కడి దాసాంజనేయస్వామి మాత్రమే నిత్యపూజలు అందుకుంటున్నాడు. ఈ స్వామి మహిమలను గురించి ఇక్కడ అంతా చెబుతూ వుంటారు. మనసులోని ధర్మబద్ధమైన కోరికను స్వామికి చెప్పుకుని మండలం పాటు రోజుకి పదకొండు ప్రదక్షిణలు చేసి ... ముగింపు రోజున స్వామివారికి తమలపాకులతో పూజ చేయించవలసి వుంటుంది.

ఈ విధంగా చేయడం వలన నలభై రెండో రోజున ఆ కోరిక నెరవేరుతుందని చెబుతుంటారు. ఈ స్వామి అనుగ్రహంతో సంపదలు ... సంతానం ... ఆరోగ్యాన్ని... ఉద్యోగాన్ని... పొందినవాళ్లు తమ అనుభవాలను గురించి చెబుతుంటారు. ఈ కారణంగా ప్రతి మంగళవారం స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఆయన ఆశీస్సులను ... అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News