అరుదైన ఆలయాన్ని ఇక్కడ చూడొచ్చు

సాధారణంగా ఏ గ్రామంలోనైనా రామాలయంగానీ ... కృష్ణాలయంగాని ఉంటూ వుంటాయి. లేదంటే ఒక చోట రామాలయం ... మరొక చోట కృష్ణాలయం దర్శనమిస్తూ వుంటాయి. అలా కాకుండా రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో కొలువై వుంటే తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది. రామకృష్ణులను ఒకేసారి దర్శించుకోవచ్చన్న ఆనందం కలుగుతుంది.

అలాంటి గ్రామంగా మనకి నెల్లూరు జిల్లాకి చెందిన సూళ్లూరుపేట కనిపిస్తుంది. ఇక్కడే 'మన్నారు పోలూరు' క్షేత్రం అలరారుతోంది. ఈ క్షేత్రం మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుని కనిపిస్తుంది. సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడిని సంహరించి 'శ్యమంతకమణి'ని చేజిక్కుంచుకున్నాడనే నింద కృష్ణుడిపై పడుతుంది.

ఆ నిందను చెరిపెసుకోవడం కోసం బయలుదేరిన కృష్ణుడు ... ఆ శ్యమంతకమణి జాంబవంతుడి దగ్గర వుండటం చూసి అడుగుతాడు. తనతో మల్లయుద్ధం చేసి గెలిస్తేనే అది సొంతమవుతుందని అంటాడు జాంబవంతుడు. శ్యమంతకమణితోనే వెనుదిరగాలనే పట్టుదలతో వున్న కృష్ణుడు, ఆయనతో మల్లయుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. అలా వాళ్లిద్దరూ మల్లయుద్ధం చేసిన ప్రదేశంగా ఈ క్షేత్రం చెప్పబడుతోంది.

ఈ యుద్ధంలో గెలిచిన కృష్ణుడికి ... శ్యమంతమణితో పాటు తన కూతురు జాంబవతినిచ్చి ఆయన వివాహం జరిపిస్తాడు. ఆ సంఘటనను కళ్లముందుంచుతూ ఇక్కడి గర్భాలయంలో జాంబవతీ సమేతంగా కృష్ణుడు ... వాళ్ల పక్కనే జాంబవంతుడు దర్శనమిస్తూ వుంటారు. ప్రాచీనకాలానికి చెందిన ఇలాంటి ఆలయం మరెక్కడా కనిపించని కారణంగా ఇది అరుదైన ఆలయంగా తన ప్రత్యేకతను ... విశిష్టతను చాటుకుంటోంది.


More Bhakti News