ఇక్కడి స్వామికి ఈ నైవేద్యాలు ఇష్టమట !
శ్రీమన్నారాయణుడు ... కృష్ణుడిగా అవతరించి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు ... అశేష భక్త జనకోటిని ఆనందసాగరంలో ఓలలాడిస్తూ వస్తున్నాడు. బాలకృష్ణుడిగా ఆయన ఆవిర్భవించిన అత్యంత విశిష్టమైన క్షేత్రంగా 'గురువాయూర్' దర్శనమిస్తుంది. దేవతల గురువైన బృహస్పతి ... వాయుదేవుడి సాయంతో ఇక్కడ కృష్ణుడి ప్రతిమను ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందట.
ఈ విషయం తెలియగానే ఎవరైనా సరే ఈ పేరు అద్భుతంగా అమరిందని అనుకుంటారు. అంతా ఆయనను 'గురువాయురప్ప' అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ వుంటే, భక్తుల మనసుకు స్వామి ఎంత దగ్గరయ్యాడో అర్థమవుతూ వుంటుంది. ప్రతినిత్యం స్వామివారికి జరిగే వివిధ రకాల సేవలు ఆయన వైభవానికి అద్దంపడుతూ వుంటాయి. ఇక్కడి స్వామికి కొబ్బరితోను ... కొబ్బరి పాలతోను చేసిన పదార్థాలు ఎంతో ఇష్టమని చెబుతుంటారు. ప్రతి రోజు ఉదయాన్నే ఆ నైవేద్యాలనే ఆయనకి సమర్పిస్తూ వుంటారు.
ప్రతి రోజు ఉదయాన్నే ప్రధాన అర్చకుడు స్వామివారి ఆలయం తలుపులు తీయగానే, నాదస్వరంతో ఆ స్వామిని మేల్కొల్పుతారు. పాలతోను ...కొబ్బరి నీళ్లతోను ... సుగంధ ద్రవ్యాలతోను స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. పట్టువస్త్రాలను ధరింపజేసి ... బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ తరువాత కొబ్బరి పాలను ... కొబ్బరి ఉండలను ... పాలు - బెల్లంతో కూడిన తీపి రొట్టెలను ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తారు.
కేరళలో కొబ్బరి దిగుబడి ఎక్కువ కాబట్టి ఇక్కడి స్వామి నైవేద్యాల్లో కొబ్బరి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుందని కొందరు అంటారు. కొబ్బరితో కూడిన పదార్థాలు స్వామికి ఇష్టం కనుకనే ఈ ప్రాంతంలో కొబ్బరి విరివిగా లభిస్తుందని మరికొందరు అంటారు. ఏదేవైనా పురాణపరమైన నేపథ్యం ... చారిత్రక పరమైన ఘనతను కలిగిన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే అదృష్టమని అనిపిస్తుంది. అంబారీపై ఊరేగే స్వామిని దర్శించగానే ధన్యులమైనట్టుగా అనిపిస్తుంది.