కృష్ణుడి వేణుగానం ఇప్పటికీ వినిపిస్తుందట !
కృష్ణుడు తన వేణుగానంతో గోపాలకులను ... గోపికలను మంత్రముగ్ధులను చేసేవాడు. ఆ వేణుగానానికి పశువులు ... పక్షులు కూడా పరవశించిపోయేవి. ఆ వేణునాదాన్ని అవి తమకి ఆయన పంపిన ఆహ్వానంగా భావించేవి. ఎక్కడో కొండరాళ్లపైన ... చిటారు కొమ్మలపైన కూర్చుని ఆయన వేణువు వాయిస్తూ వుంటే, ఆ వైపుగా అవన్నీ సాగిపోయేవి.
వేణుగానంలో నుంచి కృష్ణుడు ఈ లోకంలోకి వచ్చి, చుట్టూ మూగిన గోవులను ... గోపాలకులను చూసి సంతోషంతో పొంగిపోయేవాడు. అల్లరి ... ఆనందం ... పారవశ్యంతో ఆ సమయంలో అక్కడ ఒక పండుగ వాతావరణం కనిపించేదట. ఆ ఘట్టాలను గురించి వింటూ వుంటే అందరికీ అందులో భాగస్వాములు కావాలనిపిస్తుంది. అలాంటి వేణుగానం ఇప్పటికీ అప్పుడప్పుడు వినిపిస్తూ ఉందంటే ఎవరికి మాత్రం ఆశ్చర్యం కలగదు.
కృష్ణుడు గోపికలతో కలిసి ఆడిపాడిన 'బృందావనం' లో అడుగడుగునా ఆ స్వామికి సంబంధించిన అనేక లీలావిశేషాలు పలకరిస్తూ వుంటాయి. ఇక్కడి భాండీరవనానికి దగ్గరలో 'వంశీ వటం' అనే పేరుతో ఒక మహావృక్షం దర్శనమిస్తుంది. అప్పట్లో కృష్ణుడు ఈ చెట్టుపై కూర్చుని వేణువు ఊదేవాడట. ఇప్పటికీ ... అప్పుడప్పుడు రాత్రి వేళలో ఈ ప్రదేశంలో వేణుగానం వినిపిస్తూ ఉంటుందని అంటారు. ఆ వేణుగానం చెవినపడిన వాళ్లు అదృష్టవంతులని చెబుతుంటారు.
ఇందులో నిజానిజాల మాట అలా ఉంచితే, ఎంతో ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపించే ఆ మహావృక్షాన్ని చూస్తుంటే ఏ చెట్టుకొమ్మ చాటునో కృష్ణుడు దాక్కున్నాడేమోనని అనిపిస్తుంది. ఆయన చెట్టు దిగడమే ఆలస్యం ఆయన అల్లరి బృందంలో చేరిపోవాలని మనసు ఆరాటపడుతుంది.