కుండలు అమ్మిపెట్టిన దేవుడు

పాండురంగస్వామి పరమభక్తులలో గోరా కుంభార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కుండలు తయారుచేసి వాటిని వారం .. వారం సంతలో అమ్మకానికి పెట్టి, వాటిపై వచ్చిన ఆదాయంతో భార్యాబిడ్డలను పోషిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. కుండలు చేయడం ... అమ్మడం తప్ప ఆయనకి మరోపని తెలియదు.

కుండలు తయారుచేస్తూనే పాండురంగస్వామిని తలచుకుంటూ ఉండేవాడు. అందువలన తాను చేస్తోన్న పని తనకి పెద్ద కష్టంగా అనిపించేది కాదు. ఇక ఆ ఊళ్లో చాలామంది కుండలు తయారుచేసే వాళ్లు ఉన్నప్పటికీ, గోరా కుండల అమ్మకం బాగా జరిగేది. కుండల తయారీలోను ... వాటిని కాల్చడంలోను ఆయన నైపుణ్యం గురించి అంతా చెప్పుకునే వాళ్లు.

అలాంటి గోరా భగవంతుడికి ఇచ్చిన మాట తప్పాననే బాధతో తన రెండు చేతులను తీసేసుకుంటాడు. ఇక ఆయన కుండలు ఎలా తయారు చేస్తాడు ? భార్యాబిడ్డలను ఎలా పోషిస్తాడు ? అని ఊళ్లో వాళ్లు అనుకోసాగారు. గోరా కుటుంబం పస్తులుండే పరిస్థితికి చేరుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పాండురంగడు ... మారువేషంలో ఆయన ఇంటికి వస్తాడు.

గోరా వద్దని చెప్పినా వినిపించుకోకుండా ఆయన ఇంట్లో పనివాడిగా చేరతాడు. తన కన్నా చేయితిరిగిన వాడిగా ఆయన కుండలు తయారు చేయడం చూసి గోరా ఆశ్చర్యపోతాడు. పనివాడి వేషంలో వున్న స్వామి ఆ కుండలను సంతకు తీసుకువెళ్లి వాటిని అమ్మేసి వచ్చిన డబ్బులను గోరాకి ఇస్తుంటాడు. ఆ డబ్బుతో ఆ ఇల్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడుస్తూ వుంటుంది.

ఆ పాండురంగడే అతణ్ణి తన ఇంటికి పంపించాడని గోరా అనుకుంటాడేగానీ, సాక్షాత్తు ఆయనే స్వయంగా వచ్చాడని మాత్రం గ్రహించలేకపోతాడు. తనని విశ్వసించిన భక్తుడికి సేవ చేయడంలోనే భగవంతుడు నిజమైన ఆనందాన్ని పొందుతాడని చెప్పడానికి ఈ సంఘటనను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


More Bhakti News